మణుగూరు టౌన్, సెప్టెంబర్ 25 : ప్రజాక్షేత్రంలో ఉండి పనిచేస్తే ప్రతీ నాయకుడు, కార్యకర్తకు పార్టీలో మంచి గుర్తింపు లభిస్తుందని భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. మణుగూరులో బుధవారం నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన రేగా.. తొలుత బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలాలు, గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.
ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఆవేశంతో కాకుండా.. ఆలోచనతో పనిచేయాలని, ప్రభుత్వం చేస్తున్న తప్పులను గుర్తించి సంబంధిత శాఖల అధికారులను ప్రశ్నించాలన్నారు. బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే శ్రమించాలన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు తావివ్వొద్దని, ముఖ్యమైన అంశాలపై తనను సంప్రదించి పోస్ట్లు పెట్టాలని రేగా సూచించారు.
అనంతరం మణుగూరు పట్టణంలోని 100 పడకల ఆస్పత్రిని సందర్శించిన రేగా వైద్యులతో కలిసి అన్ని వార్డులను కలియతిరిగారు. రోగులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో మణుగూరు సొసైటీ అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు, నాయకులు వట్టం రాంబాబు, కుంట లక్ష్మణ్, యాదగిరిగౌడ్, బొలిశెట్టి నవీన్, ముద్దంగుల కృష్ణ, కత్తి రాము, ఆవుల నర్సింహారావు, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు నాగెల్లి వెంకట్, పాకాల రమాదేవి, దారావత్ రమాదేవి, సుజాత తదితరులు పాల్గొన్నారు.