సారపాక/ మణుగూరు టౌన్, జూలై 31:గౌరవప్రదమైన శాసనసభను కౌరవసభగా మార్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని అసెంబ్లీ సాక్షిగా అవమానించారని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆరోపించారు. నిండు సభలో సబితమ్మ కంట కంటతడి పెట్టించిన కాంగ్రెస్కు తగిన శాస్తి జరుగుతుందని స్పష్టం చేశారు. బుధవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను రేగా కాంతారావు ఖండించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
తమ ప్రజాపాలన అంటూ చెప్పుకుంటున్న సీఎం రేవంత్రెడ్డి.. రాక్షస పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. అసలు సిసలు కాంగ్రెస్ వాది అయిన వైఎస్ రాజశేఖరరెడ్డే సబితా ఇంద్రారెడ్డిని చెల్లెమ్మలా గౌరవిస్తే.. నకిలీ కాంగ్రెస్ నాయకుడైన రేవంత్రెడ్డి ఆమెను అగౌరవపరిచి అవమానిస్తున్నారని ఆరోపించారు. ‘మహిళలను అవమానపర్చడమే కాంగ్రెస్ విధానమా?’ అని ప్రశ్నించారు. అసెంబ్లీ గౌరవాన్ని రేవంత్రెడ్డి తగ్గిస్తున్నారని, కక్షపూరితంగా వ్యవహరించి సబితను మనోవేదనకు గురిచేశారని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి వెంటనే సబితమ్మకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.