బూర్గంపహాడ్ (భద్రాచలం), సెప్టెంబర్ 13: ‘మాది ప్రజాపాలన..’ అని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులు చేయడమే పనిగా పెట్టుకున్నదని, ఇదంతా ఒక పథకం ప్రకారం నడుస్తున్నదని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు విమర్శించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. భద్రాచలంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గూండాలు వరుసగా దాడులు చేస్తున్నా ప్రభుత్వం ఏమాత్రమూ స్పందించడం లేదన్నారు. ఇటీవల మాజీ మంత్రి హరీశ్‌రావు ఇంటిపై, ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన బీఆర్ఎస్ నేతలపై దాడికి దిగినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘మీకు పాలనపై మీకు నమ్మకం ఉంటే.. పదిమంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలో మళ్లీ గెలిపించి చూపించాలి’ అని డిమాండ్ చేశారు.
పార్టీ మారిన తెల్లం వెంకట్రావు నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ, గోడవర్తి నర్సింహమూర్తి, సాగి శ్రీనివాసరాజు, ఆకోజు సునీల్‌కుమార్, ఉడత రమేశ్, డానియేలు, ప్రదీప్, యువరాజు, ఐనాల రామకృష్ణ, ప్రకాశ్, అనిల్, నాగరాజు, రాణి, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.