పినపాక, జూలై 29 : అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అందిస్తున్నది ప్రజా పాలన కాదని.. ప్రజలను వంచించే పాలన అని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ధ్వజమెత్తారు. సోమవారం ఈ బయ్యారం అడ్డరోడ్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని మండిపడ్డారు.
గ్రామాల్లో చాలా మంది అర్హులైన రైతులకు రుణమాఫీ కాలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అబద్ధపు పాలనపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. బీఆర్ఎస్ నాయకులు అధైర్యపడొద్దని, భవిష్యత్‌లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. నాయకులు, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీశ్‌రెడ్డి, ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఎంపీటీసీ కాయం శేఖర్, పీఏసీఎస్ అధ్యక్షుడు వర్మ, నాయకులు భద్రయ్య, భవానీ శంకర్, వాసుబాబు, బుల్లిబాబు, వెంకటరెడ్డి, సత్తిబాబు, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.