మణుగూరు టౌన్, నవంబర్ 13 : ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో అన్ని విధాల నష్టపోయిన ఆటో కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. మణుగూరు సురక్ష బస్టాండ్ ఆటో అడ్డాను బుధవారం సందర్శించిన ఆయన ఆటో కార్మికులతో కాసేపు మాట్లాడారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రేగా మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు నోటికొచ్చిన హామీలు గుప్పించారని, వాటిని ఇప్పుడు అమలు చేయాలని ఆయా వర్గాలు ప్రశ్నిస్తే దాడులకు దిగడం.. కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. రోజూ ఆటో నడిపితేనే పూట గడిచే కార్మికులకు ప్రయాణికులు లేక పూట గడవక నానా అవస్థలు పడుతున్నారని, కనీసం వారిని ఆదుకోవాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేయడం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికులకు అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని ఆయన ధైర్యం చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందని, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు.