దమ్మపేట, నవంబర్ 16: ఎన్నో పోరాటాలు, ప్రాణ త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. 420 హామీలు అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని వదలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. స్థానిక పార్కలగండిలోని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కొబ్బరి తోటలో ఆయనతో కలిసి శనివారం నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో రేగా మాట్లాడారు.
11 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని విమర్శించారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఇక్కడి నుంచే డబ్బుల మూటలు వెళ్తున్నాయని ఆరోపించారు. ఓ మంత్రి బాంబులు పేలుతాయని పదే పదే చెబుతున్నా.. అవన్నీ తుస్సుమంటున్నాయని ఎద్దేవా చేశారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక జరిగితే.. అక్కడ బీఆర్ఎస్దే విజయమని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నా అభివృద్ధి మాత్రం సున్నా అన్నారు. రాబోయే కాలంలో మళ్లీ కాబోయే ముఖ్యమంత్రి కేసీఆరే అని రేగా స్పష్టం చేశారు.
ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని వాటిని కూడా నెరవేర్చిన ఘనత గత కేసీఆర్ ప్రభుత్వానిదేనని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్‌లోని కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులను బెదిరిస్తున్నారని, వారు పద్ధతి మార్చుకోకపోతే రానున్న రోజుల్లో వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే ప్రభుత్వానికి భయమేస్తున్నదని, అందుకే వాయిదాలు వేస్తున్నదన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు దొడ్డా రమేశ్, తూతా నాగమణి, దారా మల్లికార్జునరావు, రావు జోగేశ్వరరావు, గాజుబోయిన ఏసుబాబు, దారా యుగంధర్, తెలంగాణ శ్రీను, పాకనాటి శ్రీను, దేవులపల్లి పెద్ద బుజ్జయ్య, తాటి పోతురాజు, రావుల శ్రీనివాసరావు, జలగం వాసు, రెడ్డిమళ్ల నాగయ్య, ఎస్కె బుడే, ఉయ్యాల చిన్నవెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.