మణుగూరు టౌన్, జనవరి 5: కట్టు కథల కాంగ్రెస్ సర్కారు.. రైతుభరోసాపై మాట తప్పిందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు విమర్శించారు. హామీలు అమలు చేయకుండా మొదటి నుంచీ ప్రజలను మోసం చేస్తూ వచ్చిందని, ఇప్పుడు రైతులను కూడా దగా చేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు.. ఏడాది దాటిని వాటిని అమలు చేయలేదని ధ్వజమెత్తారు.
ఇప్పుడు రైతుభరోసా విషయంలో కూడా మాట తప్పారని విమర్శించారు. రైతుభరోసా కింద అన్నదాతలకు పంటల పెట్టుబడి సాయంగా ఏటా ఎకరానికి రూ.15 వేల చొప్పున ఇస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టిందని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ రైతుభరోసాను రూ.12 వేలకే పరిమితం చేయడమంటే రైతులను వంచించడమేనని తూర్పారబట్టారు. రైతులకు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రేవంత్రెడ్డి సర్కారు యావత్ రైతాంగాన్ని మోసం చేసిందని విమర్శించారు.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏడాదిపాటు కాలయాపన చేసిన సీఎం రేవంత్రెడ్డి.. ఇప్పుడు రైతుభరోసాకు అనేక కొర్రీలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రైతుభరోసాకు కోతపెట్టిన రేవంత్రెడ్డి ప్రభుత్వం.. ప్రతీ రైతుకూ గుండెకోతను మిగిల్చిందని విమర్శించారు. ఇప్పటికైనా తుపాకీ రాముడి మాటలు బంద్ పెట్టాలని హితవుచెప్పారు. రైతుభరోసాపై మాటతప్పిన రేవంత్రెడ్డి సర్కార్.. రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు కోసం ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు.