ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 7: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కూటమి అభ్యర్థులు గెలిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పు వస్తుందని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అన్నారు. శనివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 20, 21వ వార్డుల్లో బీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మల్లయ్య, బత్తిని మంగమ్మల విజయాన్ని కాంక్షిస్తూ సీపీఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ముత్తగూడెం గ్రామ పొలిమేరలో స్థానిక మహిళలు వందల సంఖ్యలో వచ్చి నాయకులకు అపూర్వ స్వాగతం పలికారు.
దారి పొడవున నినాదాలు చేస్తూ కార్యకర్తలు డీజేలకు అనుగుణంగా ఆటాపాట నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే కందాల మాట్లాడుతూ అలవిగాని హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టాలని కోరారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 31 వార్డుల్లో బీఆర్ఎస్ కూటమి అభ్యర్థులు స్పష్టమైన మెజార్టీతో గెలవబోతున్నారని, రాష్టంలోనే ఈ తీర్పు చర్చకు దారి తీస్తుందన్నారు.
అధికారంలో ఉన్నామని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌కు ఓటర్లు ఎన్నికల సమయంలో తగిన రీతిలో బుద్ధి చెబుతారని అన్నారు. ఈ రెండ్రోజులు బీఆర్ఎస్, సీపీఎం కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో వ్యవహరిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముత్తగూడెంలో స్థానిక ఓటర్లు ఓ చారిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు ముత్యం కృష్ణారావు, బత్తిని ఆనంద్‌తోపాటు సీపీఎం నాయకులు పాల్గొన్నారు.