అశ్వారావుపేట టౌన్, ఆగస్టు 22 : అధికార దాహం కోసం కాంగ్రెస్ పార్టీ చేయని వాగ్దానాలు లేవు.. పెట్టని ఒట్టులు లేవు. ప్రజలను మాయ చేసేందుకు ఆరు పథకాలు అంటూ ప్రగల్భాలు పలికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్ది నెలలోనే ఆరు పథకాలు అమలు చేస్తాం భగంతునిపై ఒట్టు పెట్టుకున్నారు. ఇప్పుడు గెలిచి అధికారం చేపట్టి ఎనిమిది నెలలు అవుతున్నా ఆరు పథకాలు అంతంత మాత్రం అందిస్తూ ఒట్టు తీసి గట్టున పెట్టారు అని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు, వినతిపత్రాల అందజేత కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మెచ్చా మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో రైతులను కేసీఆర్ కడుపులో పెట్టుకుని కాపాడుకున్నారని అన్నారు. కానీ మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను అమలు చేయడంలో కాలయాపన చేస్తున్నదని దుయ్యబట్టారు. షరుతులు లేని రూ.2 లక్షల లోపు ఋణాలను పూర్తిగా మాఫీ చేస్తామని నమ్మబలికి నేడు సగం మందికి కూడా చేయకపోవడంతో రైతులు ధర్నాలు చేస్తున్నారన్నారు. షరతులు లేని రుణమాఫీతో పాటు పేదలకు ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని లేని పక్షంలో ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఉండి పోరాడుతుందని హెచ్చరించారు.
కాంగ్రెస్ సర్కారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక బీఆర్ఎస్పై బుదర జల్లే ప్రయత్నం చేస్తుందని, అర్హులైన ప్రతిఒక్కరికీ రుణమాఫీ చేయాల్సిందేనని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో రుణమాఫీపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తన ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఉపయోగం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే రైతులకు న్యాయం జరిగిందన్నారు. సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మాణం చేస్తే ఇప్పుడు వీళ్లు ప్రారంభించి మేమే చేశాం అని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. నాయకులు వనమా రాఘవేంద్రరావు, మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇల్లెందు రూరల్, ఆగస్టు 22 : కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో మాట మారుస్తున్నదని మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్ అన్నారు. గురువారం మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్‌తో కలిసి జగదాంబసెంటర్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి బైక్ ర్యాలీతో తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బోగస్ మాటలు చెబుతున్నారన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చి రైతులను రోడ్డు పైకి తీసుకువచ్చారన్నారు.
ప్రభుత్వం రెండు లక్షల రూపాయలను కుటుంబంలో ఒక్కరికే చెల్లిస్తామని అనడంతో పాటు అదనంగా ఉన్న సొమ్మును వడ్డీతో సహా చెల్లిస్తేనే రుణమాఫీ అమలవుతుందని చెప్పి కొర్రీలు విధించడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వతో రైతులెవ్వరూ కార్యాలయాల చుట్టూ తిరిగిన దాఖాలలు లేవన్నారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ నిలబడి న్యాయం జరిగే వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు. అలాగే అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో అర్హత కలిగిన రైతులందరికీ రూ.2 లక్షలు రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్‌రావు, బీఆర్ఎస్ నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. టేకులపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు బొమ్మర్ల వరప్రసాద్‌గౌడ్, బోడ బాలునాయక్ ఆధ్వర్యంలో రహదారిపై నిరసన తెలిపి తెలంగాణ తల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
అనంతరం తహసీల్దార్ నాగభవానికి వినతిపత్రం అందించారు. చండ్రుగొండ బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఏపీజీవీబీ, తహసీల్దార్ కార్యాలయం, రైతువేదికల ఎదుట రైతులతో కలిసి నాయకులు ధర్నా నిర్వహించారు. చండ్రుగొండలో జాతీయరహదారిపై గంటకు పైగా రాస్తారోకో, ప్రదర్శన నిర్వహించి, డిమాండ్లతో కూడిన వినతిని తహసీల్దార్ సంధ్యారాణికి అందజేశారు. దమ్మపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన దర్నాలో బీఆర్ఎస్ నాయకులతో పాటూ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొని తహసీల్దార్ నరేశ్‌కు వినతిపత్రం అందించారు. ములకలపల్లిలోని రైతువేదికలో సీపీఎం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు ఆధ్వర్యంలో స్థానిక రైతువేదికలో ఏఈవో మనోహర్‌కు రుణమాఫీ అందరికీ వర్తింపజేయాలని వినతిపత్రం అందించారు.
ములకలపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, డిమాండ్లతో కూడిన వినతిని సమర్పించారు. అశ్వాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ధర్నా నిర్వహించారు. అనంతరం నాయకులు ఆర్ఐ, ఏవోకు వినతిపత్రం సమర్పించారు. భద్రాచలంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. కరకగూడెం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించి తహసీల్ సిబ్బందికి వినతిప్రతం అందజేశారు.