టేకులపల్లి, జూలై 11: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యమని ఇల్లెందు మాజీ ఎమ్యెల్యే హరిప్రియ స్పష్టం చేశారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలని సూచించారు. మండలంలోని రోళ్లపాడు, 9వ మైల్తండా, బేతంపూడి, గోలియాతండా, తడికలపూడి, రాంపురాం, పెగళ్లపాడు, సులానగర్, ముత్యాలంపాడు క్రాస్‌రోడ్ పంచాయతీ, బిల్లుడుతండా, మద్రాస్‌తండా గ్రామాల్లో శుక్రవారం ఆమె విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో అక్కడి ప్రజలతోనూ, పార్టీ కార్యకర్తలతోనూ మాట్లాడారు.
ఆరు గ్యారెంటీలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలులో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను అరకొరగా అమలు చేస్తూ వారిని మభ్యపెడుతోందని అన్నారు. దీంతో ప్రభుత్వానికి బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు బొమ్మర వరప్రసాద్, బోడ బాలునాయక్, బానోత్ కిషన్, బానోత్ రామానాయక్, జాలాది అప్పారావు, లాలునాయక్, రేణుక తదితరులు పాల్గొన్నారు.