టేకులపల్లి, జనవరి 8 : కేసీఆర్ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో పదిలంగా ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో వాటి గురించి విస్తృతంగా ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థించాలని మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్ పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ గ్రామస్థాయి సమన్వయ సమావేశం పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో రోళ్లపాడు, తొమ్మిదోమైలుతండా, బేతంపూడి, గోలియాతండా గ్రామ పంచాయతీలలో బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా హరిప్రియానాయక్, బేతంపూడి సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్రావులు పాల్గొని మాట్లాడారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం రైతుల అభివృద్ధి గురించి ఆలోచించి వారి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తున్నదన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఇప్పటి నుంచే సమన్వయంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేయాలని కోరారు. ఎన్నికలను దృష్టి ఉంచుకుని మండలంలోని 36 గ్రామ పంచాయతీలలో సభలు, సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బోడ బాలునాయక్, శివకృష్ణ, గ్రామ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.