ఇల్లెందు, మే 17 : శాసనసభ ఎన్నికలకు ముందు వరికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే మాట మార్చిందని, రైతులను ముంచడమే పనిగా పెట్టుకున్నదని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ అన్నారు. అన్ని రకాల పంటలకు రూ.500 చొప్పున బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్త్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలోని జగదాంబ సెంటర్లో శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా హరిప్రియ మాట్లాడుతూ కేవలం సన్నరకం ధాన్యానికే బోనస్ ఇస్తామనడం ఎంతవరకు సబబు అని ఆమె ప్రశ్నించారు.
రాష్ట్రంలో దాదాపు 80 శాతం మంది రైతులు దొడ్డు రకం వరి వేస్తారని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో ఆ రైతులందరికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం అన్ని రకాల వరి పంటలకు బోనస్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు దిండిగాల రాజేందర్, నాయకులు లక్కినేని సురేందర్, సిలివేరి సత్యనారాయణ, తాత గణేశ్, సత్యనారాయణ, వరప్రసాద్, ప్రమోద్, లక్ష్మణ్‌నాయక్, అచ్చయ్య, కృష్ణప్రసాద్, పరుచూరి వెంకటేశ్వర్లు, రేణుక, శారద, మంగమ్మ, ఘాజీ, సరిత, జబ్బార్, గిన్నారపు రాజేశ్, హరికృష్ణ, నబి, చిన్నారి తదితరులు పాల్గొన్నారు.