కారేపల్లి, ఆగస్టు 16 : వైరా నియోజకవర్గంలో ఉధృతంగా ప్రవహిస్తున్న పగిడేరు వాగు, నిమ్మ వాగుల ప్రవాహాన్ని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి శనివారం పరిశీలించారు. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నందున సమీప గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వరదల కారణంగా ఆ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చంద్రావతి వారికి ఫోన్ చేసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సంబంధిత వైద్య అధికారులతో మాట్లాడి వారికి అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో ఈ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నందున, బ్రిడ్జి నిర్మించాలని అధికారులను కోరారు.
రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల ముంపు గ్రామాల ప్రజలకు పునరావాస కేంద్రాలను ముందుగానే ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో గత మూడు, నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా మంత్రులు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం పట్ల వైరా నియోజకవర్గ ప్రజలపై వారికి ఉన్న శ్రద్ధను తెలియజేస్తోందన్నారు. సమస్య వచ్చిన తర్వాత తెలుసుకోవడం తప్పా, ముందుగానే దాన్ని ఎలా పరిష్కరించాలో ఆలోచించని విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆమె విమర్శించారు.
Karepalli : ముందస్తు పరిష్కారం ఆలోచించని కాంగ్రెస్ ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి