ఖమ్మం/ దమ్మపేట, ఫిబ్రవరి 16: ఖమ్మం జిల్లా బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ పెండింగ్ పనులను త్వరతిగతిన పూర్తి చేసి పార్కును స్థానికులకు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసిన తుమ్మల బుగ్గపాడు పార్కు పనుల పురోగతి గురించి వివరించారు. ఉద్యాన పంటల రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో సత్తుపల్లి మండలం బుగ్గపాడులో 200 ఎకరాల్లో ఫుడ్ పార్కు నిర్మాణానికి 2016 నవంబర్ 13న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
కానీ ఆ తర్వాత పనులు కొంచెం మందకొడిగా కొనసాగుతున్నాయి. సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతం ఉద్యాన పంటలకు పెట్టింది పేరు. అందువల్ల బుగ్గపాడులో తుమ్మల విజ్ఞప్తి మేరకు ఆ రోజు ఫుడ్ పార్కు ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ ఫుడ్ పార్కు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీఆర్‌కు తుమ్మల వివరించారు. ఇందుకు మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించి పండ్ల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని, ఫుడ్ పార్కు పనులను వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ను మాజీ మంత్రి తుమ్మల శాలువాతో సత్కరించారు.