భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : అధికారంలోకొచ్చి 300 రోజులైనా మూడు హామీలను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. రైతుభరోసా కింద పంటలకు పెట్టుబడి సాయం ఇవ్వలేకనే కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని ధ్వజమెత్తారు. భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన పార్టీ జిల్లా కార్యకర్తల సమావేశంలో అజయ్ మాట్లాడారు. ఉత్తుత్తి హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు.. రైతులకు ఇప్పటి వరకూ రైతుభరోసా ఇవ్వకుండా వారిని దగా చేసిందని ఆరోపించారు.
రుణమాఫీపై గప్పాలు కొట్టిన రేవంత్ ప్రభుత్వం.. చివరికి సగం మంది రైతులకు కూడా మాఫీ చెయ్యలేదని దుయ్యబట్టారు. దీంతో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి జిల్లాలో గత సీఎం కేసీఆర్ నిర్మించిన సీతారామ ప్రాజెక్టును ఇప్పటి సీఎం ఓపెన్ చేసి నీళ్లు చల్లుకున్నారు గానీ రైతులకు మాత్రం సాగునీరు ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఆడబిడ్డలకు రూ.లక్ష కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తామన్న ఈ సర్కారు.. నేటికీ దానిని ఇవ్వలేక చతికిలబడిందని ఆరోపించారు.
ఇప్పటి వరకు లక్ష వివాహాలు జరిగాయని, ఆ లక్ష మంది ఆడబిడ్డలకు రూ.లక్ష చొప్పున కల్యాణలక్ష్మి సాయం అందించకపోగా.. వారికి లక్ష తులాల బంగారం బాకీ పడ్డారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కప్పదాటే వైఖరిని ఎండగట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, బానోతు హరిప్రియ, తాటి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, నాయకులు దిండిగాల రాజేందర్, రావులపల్లి రాంప్రసాద్, మానె రామకృష్ణ, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
కాగా, సమావేశమంతా కార్యకర్తల జోష్‌తో కన్పించింది. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరు కావడంతో నాయకుల్లో ఎనలేని ఉత్సాహం నిండింది. పోస్టాఫీస్ సెంటర్ నుంచి పార్టీ కార్యాలయం వరకూ వనమా టీం బైక్ ర్యాలీ ద్వారా సమావేశానికి హాజరైంది.
ఉగాది తర్వాత బీఆర్ఎస్కు పూర్వవైభవం రాబోతోందని ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టం చేశారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా బీఆర్ఎస్ శ్రేణులు భయపడబోవని స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడూ అధికారులు ప్రజాప్రతినిధుల కాళ్లు పట్టుకోలేదని గుర్తు చేశారు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అలా జరుగుతోందని ఆరోపించారు.
గత కేసీఆర్ ప్రభుత్వానికి, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారని కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్‌వన్నీ 420 హామీలేనని, వాటితోనే ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు.
ఇప్పుడున్న ముఖ్యమంత్రి జోకర్లా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేశ్‌రెడ్డి విమర్శించారు. క్యాబినెట్ అంతా జబర్దస్త్ టీంలా తయారైందని ధ్వజమెత్తారు. భద్రాచలంలో రాముడు ధర్మంగా నడిచాడని, కానీ.. భద్రాచలంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మాత్రం అధర్మంగా నడుస్తున్నాడని ఆరోపించారు.
ఢిల్లీకి మూటలు మోసేందుకే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు సమయం సరిపోతోందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు విమర్శించారు. ఇక వారు ప్రజా సమస్యలను ఎప్పడు పట్టించుకుంటారని ఎద్దేవా చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే గెలుస్తారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సత్తాను చాటుతారని అన్నారు. వచ్చే నెల నుంచి జిల్లా అంతటా పార్టీ సమావేశాలు జరుగుతాయన్నారు. ఇక నుంచి పార్టీలోకి ఎవరినీ తీసుకోబోమని అన్నారు. భద్రాచలం అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరుగుతుందని, అక్కడ మన అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవబోతున్నారని తేల్చిచెప్పారు.