భద్రాద్రి కొత్తగూడెం, జూలై 19 (నమస్తే తెలంగాణ) : అడవిని నమ్ముకుని పోడు భూమిలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆదివాసీ బిడ్డలపై అటవీశాఖ అధికారులు అమానుషంగా దాడి చేయడం హేయమైన చర్య అని, ఆదివాసీలంటే అంత చులకనా? అంటూ పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని అశ్వాపురం మండలం మనుబోతులపాడులో శుక్రవారం జరిగిన పోడుభూమల ఘటనను జిల్లావ్యాప్తంగా ఆయా సంఘాలు, పార్టీల నాయకులు ఖండించారు. ఆదివారం మనుబోతులపాడు గ్రామానికి గిరిజన బృందంతో వెళ్లిన జేఏసీ కన్వీనర్ వాసం రామకృష్ణదొర గాయాలపాలైన గిరిజనులను పరామర్శించారు. మహిళలు అని చూడకుండా విచక్షణారహితంగా కొట్టిన అటవీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే అటవీశాఖ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు.
పోడు వివాదంలో ఆదివాసీలపై దాడి చేసిన అటవీశాఖ సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఘటనను తీవ్రంగా ఖండించారు. అడవిబిడ్డలంటే అధికారులకు బాగా అలుసైపోయిందన్నారు. పోడు సాగు చేసుకుంటున్న ఆదివాసీలకు ఆ భూమిని అప్పగించేవరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు.
మణుగూరు టౌన్, జూలై 19 : పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ప్రతి గిరిజనుడికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ నేత, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పినపాక నియోజకవర్గంలో 15,962 మంది పోడు రైతులకు 56,851 ఎకరాల భూమికి పట్టాలు అందించామన్నారు. వేలాదిమంది గిరిజన, పేద రైతులకు భూహక్కులు కల్పించడం బీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. మనుబోతులగూడెంలో పోడు రైతులపై అటవీశాఖ అధికారులు వ్యవహరించిన తీరు తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు. రైతుల హక్కుల కోసం ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని, పోడు రైతులకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
– మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు