మామిళ్లగూడెం, నవంబర్ 18: ప్రజలు ఇష్టంగా తినే ఆహార పదార్థాలను కల్తీ చేసినా, నాసిరకంగా తయారు చేసి విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు. స్టేట్ ఫుడ్ సేప్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ బృంద అధికారులు.. జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మంలో పర్యటించారు. నగరంలోని పలు ఆహార పదార్థాల తయారీ కేంద్రాలను; అల్లం వెల్లుల్లి స్టోరేజ్, విక్రయ కేంద్రాలను; మిఠాయి తయారీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రిక్కాబజార్లోని మ్యాజిక్ అల్లం, వెల్లుల్లి తయారీ కేంద్రంలో నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించారు. తయారుదారులు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లేకుండా అల్లం పేస్టును తయారీ చేసి స్టోరేజ్ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కల్తీలు జరిగినట్లు గుర్తించిన రూ.1.32 లక్షల విలువైన 960 కేజీల అల్లం, వెల్లుల్లి మిశ్రమాన్ని సీజ్ చేశారు. సేకరించిన నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు పంపంచారు. చర్చికాంపౌండ్‌లో ఉన్న విజయలక్ష్మీ పిండి వంటల కేంద్రంలో పూర్తి అపరిశుభ్రంగా ఉన్న వంట గదిలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
క్యాన్సర్ కారకాలైన రసాయన రంగులను అధిక మోతాదులో స్వీట్లలో వినియోగిస్తున్నట్లు గమనించారు. అనుమతులు లేకుండా వీటిని తయారు చేసి విక్రయిస్తున్నట్లు తేల్చారు. కల్తీగా గుర్తించిన రూ.6,550 విలువైన ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. మయూరిసెంటర్‌లో ఉన్న హరి స్వీట్స్ దుకాణంలో పూర్తి అపరిశుభ్ర వాతావరణంలో స్వీట్లు తయారు చేస్తున్నట్లు తేలింది. అధిక మోతాదులో రసాయన రంగులు వాడుతున్నట్లు గుర్తించి రూ.6,950 విలువైన పదార్థాలను అక్కడే ధ్వంసం చేశారు. ఇంకా మరికొందరికి నోటీసులు జారీ చేశారు. అసరమైతే కేసులు నమోదు చేసి సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు రోహిత్‌రెడ్డి, స్వాతి, మనోజ్‌కుమార్, రతన్‌రావు పాల్గొన్నారు.