నియోజకవర్గ కేంద్రాల్లో కోచింగ్ సెంటర్ల ఏర్పాటుపై దృష్టి
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వనరులు సమకూర్చే విధంగా చర్యలు
మంత్రులు, ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ అధిష్ఠానం ఆదేశాలు
ఉమ్మడి జిల్లాలో మంత్రి అజయ్ నేతృత్వంలో సన్నాహాలు
ఖమ్మం, మార్చి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో సర్కార్ ఉద్యోగాల సైరన్ మోగింది.. ఎంతోకాలంగా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూ స్తున్న యువతకు తీపి కబురు అందించింది.. దీనిలో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్న 2,650 పోస్టులు భర్తీ కానున్నాయి.. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేం దుకు మంత్రుల నేతృత్వంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేయాలని టీఆర్ఎస్ అధిష్ఠానం ఆదేశించింది. ఈ మేరకు మంత్రి అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల్లో స్టడీ హాళ్లు, కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు..
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. నిరుద్యోగులకు తీపి కబురు అందించారు. ఉమ్మడి జిల్లాలో 2,650 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడదలకానున్నాయి. ఉద్యోగాలు సాధించేందుకు నిరుద్యోగులు పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఈసారి పదేళ్ల వరకు వయోపరిమితి పెంచడంతో గతంలో కంటే ఇప్పుడు గట్టి పోటీ ఉండనున్నది. వారికి సహాయ సహకారాలు అందించాలని టీఆర్ఎస్ అధిష్ఠానం ఇచ్చిన పిలుపు మేరకు మంత్రి అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు సమాయత్తమవుతున్నారు. నిరుద్యోగుల కల నెరవేర్చేందుకు అవసరమైన నైతిక మద్దతు, సదుపాయాల కల్పనపై దృష్టి సారించారు. ఇప్పటికే నిరుద్యోగులు సమీప పట్టణాల్లోని కోచింగ్ సెంటర్లలో చేరుతున్నారు.
మంత్రి అజయ్ ప్రత్యేక చొరవ..
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. జిల్లాకేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారిపై ఆరా తీస్తున్నారు. వారికి కల్పించాల్సిన వసతులు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇదే రీతిలో ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లోనూ తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సా రించారు. శనివారం జి ల్లాకు చేరుకున్న మంత్రి అజయ్ నిరుద్యోగులకు సహాయ సహకారాలు అందించే అంశంపై నిరుద్యోగులు, విద్యావేత్తలతో చర్చించారు.
ఎమ్మెల్యేలు సమాయత్తం..
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి పలు రూపాల్లో సహాయం అందించింది.ఈసారి కూడా సహాయ సహకారాలు అందించాలని అధిష్ఠానం ఆదేశించిన మేరకు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, రాములునాయక్, కందాళ ఉపేందర్‌రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియానాయక్, మధిర నియోజకవర్గంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు, భద్రాచలంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు నియోజకవర్గ కేంద్రాల్లో కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. ప్రధాన పట్టణాలకు వెళ్లి వ్యయ ప్రయాసలకోర్చి విద్యార్థులు చదువుకోవడం కష్టతరం కావడంతో స్థానికంగానే శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు.
అండగా ఉంటాం..
సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలపై కీలక ప్రకటన చేశారు. త్వరలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు శాసనసభ్యులు అండగా ఉంటారు. వారికి సహాయ సహకారాలు అందిస్తారు. కోచింగ్ సెంటర్లతో పాటు ఇతర అవసరాలపై దృష్టి సారిస్తాం. గతంలో పోటీ పరీక్షలకు హాజరైన నిరుద్యోగులకు ఖమ్మం శాసనసభ్యుడిగా సహాయం అందించాను. ఉద్యోగం సాధించేలా వారిలో మానసిక ైస్థెర్యాన్ని నింపాను. ఇదే స్ఫూర్తితో ఈసారి కూడా వ్యవహరిస్తాను.
– పువ్వాడ అజయ్‌కుమార్,రాష్ట్ర రవాణాశాఖ మంత్రి