శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంది ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు చెరువులు మత్తడి దుంకుతున్నాయి. వాగులు ఉగ్రరూపం దాల్చడంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొన్ని గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఒకవైపు ఈ వర్షం, ఇంకోవైపున మున్నేరు ఉప్పొంగడంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
ఖమ్మం నగరంలోని అనేక ప్రాంతాలు చెరువులను తలపించాయి. కొన్నిచోట్ల చెట్లు , మరికొన్నిచోట్ల విద్యుత్ స్థంబాలు విరిగాయి. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. అధికార యంత్రాంగాన్ని ముందస్తుగా అప్రమత్తం చేయకపోవడం, ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోకపోవడంతో దాని పర్యవసానాలను ప్రజలు అనుభవించాల్సి వచ్చింది. వరదలపై ప్రజలను ముందస్తుగా హెచ్చరించలేదని, బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ చేపట్టలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మున్నేరుకు ఎగువన కురిసిన భారీ వర్షంతో ఆకేరు వాగు, పాకాల చెరువు పొంగాయి. దీంతో మున్నేరుకు వరద ఉధృతి పెరిగింది. ఆదివారం సాయంత్రం నాటికి ఖమ్మంలో మున్నేరు నీటి మట్టం 36 అడుగులకు చేరింది. దీంతో, మున్నేరు లోతట్టు ప్రాంతాలైన బొక్కలగడ్డ, వెంకటేశ్వరనగర్, మాణిక్యనగర్, మోతీనగర్, పద్మావతి నగర్, దానవాయిగూడెం, ధంసలాపురం నీట మునిగాయి.
ఇండ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు కట్టుబట్టలతో, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. అధికారులు ఆదివారం ఉదయం నుంచి ఉపశమన చర్యలు చేపట్టారు, అప్పటికే నష్టం జరిగింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా నగరంలోని చైతన్య నగర్, కవిరాజ్నగర్, చెరువుబజార్, కూరగాయల మార్కెట్, మామిళ్లగూడెం తదితర ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. లకారం చెరువు దగ్గర గండి కొట్టి మున్నేరులోకి నీరు పారేలా చేయడంతో ఆయా ప్రాంతాలలో వరద నీరు తగ్గింది.
ఆదివారం సాయంత్రం నాటికి మున్నేరు నీటి మట్టం 36 అడుగులకు చేరింది. దీంతో కాల్వొడ్డు బ్రిడ్జి మీదుగా రాకపోకలను ఉదయం నుంచే అధికారులు నిలిపివేశారు. ప్రకాశ్ నగర్ బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తుండటంతో ఆ మార్గంపై కూడా రాకపోకలను నిలిపివేశారు. కరుణగిరి బ్రిడ్జిపై నుంచి సాయంత్రం వరకు వాహనాలను అనుమతించారు. ఆ తరువాత నిలిపివేశారు. – నమస్తే నెట్వర్క్