ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 29 : ‘ఈనామ్ ఈనామే.. జెండాపాట జెండాపాటే..’ అనేలా ఉంది ఖమ్మం ఏఎంసీలో ఖరీదుదారుల తీరు. మిర్చి మినహా పత్తి, అపరాల విక్రయాల్లో ఈనామ్ (జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం) అమల్లో ఉన్నప్పటికీ ఖరీదుదారులు దానికి ఎగనామం పెడుతున్నారు. సాక్షాత్తూ ఏఎంసీ సిబ్బంది ఎదుటే జెండాపాట నిర్వహిస్తున్నారు. ‘అక్కడ జెండా లేదుగా? అది జెండా పాట ఎలా అవుతుంది?’ అంటూ సాంకేతిక కారణం చెబుతున్నారు గానీ అక్కడ జరిగేది మాత్రం జెండాపాటే. దీంతో ఈనామ్ విధానానికి, సీక్రెట్ బిడ్డింగ్‌కు అర్థం ఏముందున్న ప్రశ్న రైతుల్లో వ్యక్తమవుతోంది.
రైతులకు మంచి ధర కల్పించేందుకే “ఈనామ్”
వ్యాపారుల్లో పోటీతత్వాన్ని పెంచాలని, తద్వారా రైతులకు మంచి ధర కల్పించాలని గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి. దీనికోసం అప్పటి వరకూ ఉన్న జెం డాపాట (వ్యాపారులు సిండికేట్ అయి పం టల ధరలను నియంత్రిస్తున్నందున) విధానాన్ని పక్కనబెట్టాయి. దాని స్థానంలో ఏడెనిమిదేళ్ల క్రితం ఈనామ్ విధానాన్ని తీసుకొచ్చాయి. దీని ప్రయోజనాల గురించి ఇటు రై తులకు, అటు వ్యాపారులకు అవగాహన కల్పించాయి. వారిని ఒప్పించాయి. అప్పటి నుంచి ఈనామ్ విధానాన్ని అమలుచేస్తున్నాయి.
రైతులకు ముందుగానే గుర్తింపు సంఖ్యలిచ్చి..
ఈనామ్ అమలు కోసం అధికారులు వివిధ నిబంధనలను అమల్లోకి తెచ్చారు. ఇందులో భాగంగా పంటలను మార్కెట్‌కు తెచ్చిన రైతులకు ముందుగానే గేట్ వద్ద ఏఎంసీ సిబ్బంది ఎంట్రీలు నమోదుచేస్తారు. వారికి ఒక ఐడీ (గుర్తింపు సంఖ్య)ను ఇస్తారు. రైతు పంటను, దాని నాణ్యతను మార్కెట్ యార్డులో పరిశీలించుకున్న ఖరీదుదారుడు.. సదరు రైతు ఐడీని తీసుకుంటాడు. ఆ పంటకు తాను ఎంత ధర పెట్టగలడో అనే విషయాన్ని నిర్ణయించుకుంటాడు. అక్కడి కంప్యూటర్ రూములోకి వెళ్లి ఆ ఐడీకి ఆన్లైన్లో బిడ్డింగ్ వేస్తాడు.
ఆ పంటకు వెచ్చించగలిగే ధరను ఆ బిడ్డింగ్‌లో పొందుపరుస్తాడు. ఇదంతా సీక్రెట్ విధానంలో జరుగుతుంది కాబట్టి పంటలను దక్కించుకోవాలనుకునే ఖరీదుదారులు తన సహచర ఖరీదుదారులకంటే ఎక్కువ ధరకు బిడ్డింగ్ వేస్తారు. దీని ద్వారా రైతుకు లాభం చేకూరుతుంది. అయితే, ఇన్నాళ్లూ ఇదే విధానంలో కొనసాగిన ఈనామ్ ప్రక్రియకు కొంతకాలంగా ఖరీదుదారులు తిలోదకాలిచ్చారు. బయట బహిరంగంగానే మార్కెట్ సిబ్బంది ఎదుట జెండాపాట నిర్వహించి, పంట ధరను అందరికీ వెల్లడించి.. ఆ తరువాత వెళ్లి ఆన్లైన్ బిడ్డింగ్‌లో అదే ధరను నమోదు చేస్తున్నారు.
కానీ తాము ఈనామ్‌ను పాటిస్తున్నట్లుగా అధికారుల ఎదుట వ్యవహరిస్తున్నారు. దీంతో ఈనామ్ విధానానికి ఎగనామం పెట్టినట్లవుతోంది. ఖరీదుదారులు ముందుగానే సిండికేట్ అయి ధరలను నియంత్రించడంతో రైతులు మళ్లీ నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. కాగా, గురువారం అపరాల యార్డుకు 94 మంది రైతులు 1,544 బస్తాల పెసలను తెచ్చారు. ఆన్లైన్లో బిడ్డింగ్ వేసిన తరువాత కానీ గరిష్ట ధర తెలియాల్సి ఉంటుంది. కానీ సాక్షాత్తూ సిబ్బంది ఎదుటే జెండాపాట పెట్టారు.
అపరాల్లో జెండాపాట నిబంధనలకు విరుద్ధం..
ప్రస్తుతం ఖమ్మం మార్కెట్లో మిర్చికి మినహా మిగిలిన అన్ని పంటల క్రయవిక్రయాలూ ఈనామ్ ద్వారానే జరుగుతున్నాయి. పత్తి, అపరాల కొనుగోళ్ల ప్రక్రియ దాదాపు పదేళ్లుగా బిడ్డింగ్ ద్వారానే జరుగుతోంది. ఇటీవల యార్డులో కొందరు ఖరీదుదారులు జెండాపాట పెట్టడం నిబంధనలకు విరుద్ధం. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటాం.
-ప్రవీణ్‌కుమార్, ఖమ్మం ఏఎంసీ సెక్రటరీ