ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ చుంచుపల్లి, జూన్ 19 : తాము బండెడు కష్టాలు పడినా తమ పిల్లలకు మాత్రం మరింత మెరుగైన విద్యనందించాలని కలలుగంటున్నారు నేటి తల్లిదండ్రులు. ఇందుకోసం తాము ఒకపూట పస్తులుండైనా సరే.. తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపాలని ఆరాటపడుతున్నారు. అందుకోసం తాము చెమటోడ్చి పోగుచేసిన మొత్తాన్ని ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దాహానికి ధారగా పోస్తున్నారు. కానీ, కొన్ని స్కూళ్ల యాజమాన్యాలు మాత్రం.. అందుకు తగినట్లుగా పసిపిల్లలకు సురక్షిత ప్రయాణాన్ని అందించడంలేదు. రవాణా శాఖ నిబంధనలను పాటించకపోవడం, అనుభవ లేమి, లైసెన్స్‌లేని డ్రైవర్లను నియమించుకోవడం, వారి వచ్చీరాని డ్రైవింగ్‌తో పిల్లలను స్కూళ్లకు, ఇళ్లకు రవాణా చేస్తుండడం, ఫలితంగా తరచూ ప్రమాదాలు జరుగుతుండడం, కొన్నిసార్లు పిల్లలు గాయపడుతుండడం, మరికొన్ని సార్లు ప్రాణాలూ కోల్పోతుండడం వంటివి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏటా జరుగుతూనే ఉండడం ఆందోళనకరం.
తాము తిన్నా తినకున్నా తమ పిల్లలకు మాత్రం బంగారు భవిష్యత్తునివ్వాలని తాపత్రయంతో ఎండవానల్లో విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నారు తల్లిదండ్రులు. అందుకోసం తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చేర్పించి రూ.వేలు, రూ.లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్నారు. కానీ.. ఆయా స్కూళ్ల యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా తమ పిల్లలే ప్రమాదాల భారిన పడుతున్నారు. ఒక్కపైసా తక్కువ చేయకుండా బస్సు ఫీజులు తీసుకుంటున్న స్కూళ్ల యాజమాన్యాలు.. బడి పిల్లలను రవాణా చేసే బస్సుల విషయంలో మాత్రం భద్రతా ప్రమాణాలను పాటించడం లేదు. సామర్థ్య పరీక్షలు చేయించని బస్సుల్లో బుడిబుడి అడుగుల పిల్లలను ఎక్కించి రవాణా చేస్తున్నాయి. సామర్థ్యం లేని బస్సులను.. వాహనం నడిపే అర్హతలేని, అర్హత పత్రాలు(లైసెన్స్) లేని డ్రైవర్లకు ఇచ్చి పిల్లలను అందులో ఎక్కిస్తున్నాయి. కానీ.. వీటిలో ఏ కారణంగా ప్రమాదం జరిగినా ఫలితం మాత్రం పిల్లలు అనుభవిస్తున్నారు. మూల్యం మాత్రం తల్లిదండ్రులు చెల్లించుకుంటున్నారు.
తాము బండెడు కష్టాన్ని మోసి తమ పిల్లలను ప్రైవేటు బడికి పంపిస్తే.. వారు తిరిగి వచ్చేదాకా తల్లిదండ్రుల్లో ఆందోళనే. వారు క్షేమంగా, సురక్షితంగా ఇంటికి చేరుకునేదాకా కళ్లలో ఒత్తులేసుకొని ఎదురుచూపులు చూడక తప్పని పరిస్థితి. ఉదయం ‘బై’ చెప్పి బడి బస్సు ఎక్కిన తమ చిన్నారి.. తిరిగి సాయంత్రం అదే బస్సు దిగి ‘అమ్మా/నాన్నా..’ అనుకుంటూ గుమ్మం ముందుకు చేరుకునేదాకా దిగాలే. ప్రైవేటు పాఠశాలలకు వాటి బస్సుల్లో వెళ్తూ.. వస్తూ ఉన్న అభం శుభం తెలియని పసిప్రాయాలు.. డ్రైవర్ల అనుభవరాహిత్యం, బస్సుల సామర్థ్య రహితం వంటి కారణాలతో గాలిలో దీపాలైన దుర్ఘటనలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేకం. ఈ అనుభవ పాఠాల రీత్యా తల్లిదండ్రులు కూడా తమ పిల్లల సురక్షిత ప్రయాణం గురించి దిగులు పడుతుంటారు. కానీ.. స్కూళ్ల యాజమాన్యాలు మాత్రం పట్టింపులేనితనాన్ని ప్రదర్శిస్తున్నాయి.
బడి బస్సులు రాని ప్రాంతాల్లో ఆటోవాలాలు బడి పిల్లలను తమ ఆటోల్లో ఎక్కించుకొని పాఠశాలల వద్ద దింపుతున్నారు. తల్లిదండ్రులు వద్దని వారిస్తున్నా ఆటోవాలాలు మాత్రం తమ ఆటోల్లో పది నుంచి పదిహేను మంది వరకూ ఎక్కించుకొని తీసుకెళ్లి తీసుకొస్తున్నారు. ఆటో అయితే కాస్త తక్కువ ఖర్చుతో పిల్లలను బడికి పంపవచ్చనుకుంటున్న కొందరు తల్లిదండ్రులు.. ఆటో నిండా పిల్లలను ఎక్కించినా మారుమాట్లాడడం లేదు. కానీ.. అనుకోని ప్రమాదాలు జరిగితే మాత్రం వారే మూల్యం చెల్లించుకుంటున్నారు. ఎక్కువమందిని ఎక్కించుకొని వెళ్తేనే గిట్టుబాటు అవుతుందనుకుంటూ ఆటో డ్రైవర్లు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇక ట్రాఫిక్ పోలీసులూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో ఫిట్నెస్ లేకుండా విద్యార్థులను రవాణా చేస్తున్న ప్రైవేటు పాఠశాలల బస్సులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ నాయకులు గురువారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సామర్థ్యంలేని బస్సులు నడుపుతూ పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అలాంటి బస్సులను సీజ్ చేయాలంటూ రవాణా శాఖ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యాలయం గేటు ఎదుట భైఠాయించి ధర్నా చేశారు.
ఫీజుల విషయంలో ‘తగ్గేదేలే..’ అంటూ తల్లిదండ్రుల ముక్కు పిండుతున్న యాజమాన్యాలు.. బస్సుల ఫిట్నెస్ విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. పాఠశాలల ప్రారంభానికి ముందే తమ బస్సులకు సామర్థ్య పరీక్షలు చేయించి సిద్ధంగా ఉంచాల్సిన యాజమాన్యాలు.. అంతులేని లక్ష్యంతో ఉంటున్నాయి. ఖమ్మం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో 45 రోజులుగా బడి బస్సుల సామర్థ్య పరీక్షలు కొనసాగుతున్నప్పటికీ.. సుమారు వెయ్యి బస్సుల్లో ఇంకా కొన్ని బస్సులు ఫిట్నెస్ టెస్టులకు వస్తుండడం గమనార్హం.
అంటే ఈ నెల 12న పాఠశాలలు ప్రారంభమైనా ఈ వారం రోజులుగా ఆయా బస్సులు సామర్థ్య పరీక్షలు లేకుండానే విద్యార్థులను రవాణా చేస్తున్నాయన్నమాట. భద్రాద్రి జిల్లాలో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఆ జిల్లాలో ప్రైవేటు విద్యాసంస్థల బస్సులు 264 ఉండగా.. గురువారం నాటికి 191 బస్సుల ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇంకా 73 బస్సులకు సామర్థ్య పరీక్షలు చేయించాల్సి ఉంది. అయినప్పటికీ ఆ బస్సులు బడి పిల్లలను రవాణా చేస్తూ ఉండడం గమనార్హం.
భద్రాద్రి జిల్లాలో మొత్తం 264 బడి బస్సులు ఉన్నాయి. వాటిలో ఇప్పటివరకు 191 బస్సులకు ఫిట్నెస్ చేయించారు. మిగతా 73 బస్సులకు ఇంకా చేయించాల్సి ఉంది. అయితే, జిల్లాలో బస్సులకు ఫిట్నెస్ టెస్టులు చేయించేందుకు కొన్ని విద్యాసంస్థలు అంతగా ఆసక్తి చూపడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నిబంధనల ప్రకారం వాహనం ఫిట్నెస్ చేయకుంటే రోజుకు రూ.50 చొప్పున ఏడాదికి రూ.18 వేలు అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
అయినా విద్యాసంస్థల్లో చలనం కనిపించకపోవడం గమనార్హం. సామర్థ్య పరీక్షల ధ్రువపత్రం లేకుండా రోడ్డెక్కే బడి బస్సులను సీజ్ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నప్పటికీ ప్రైవేటు పాఠశాలలు పెడచెవిన పెడుతున్నాయి. చాలా బస్సుల్లో ప్రథమ చికిత్స పెట్టెలు లేవు. కొన్ని బస్సుల్లో పెట్టెలు ఉన్నప్పటికీ వాటిల్లో మందులు లేవు. చాలా బస్సులకు ఇండికేటర్లు పగిలిపోయి ఉన్నాయి. అరిగిన టైర్లు, పగిలిన సైడు మిర్రర్లు దర్శనమిస్తున్నాయి.
నిబంధనలు పాటించని పాఠశాలల బస్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డెక్కనివ్వం. ప్రతి బస్సుకూ పార్కింగ్ లైట్లు, బస్సులో ఒక సహాయకుడు ఉండేలా చూస్తాం. ప్రయాణించే విద్యార్థుల చిరునామా, ఫోన్ నంబర్, చార్టు రూపంలో ఏర్పాటు చేయాలి. వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు, పొల్యూషన్, బీమా పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సు, ఆర్టీఏ అధికారులు జారీ చేసిన సామర్థ్య పరీక్షల ధ్రువపత్రాలు బస్సుల్లో అందుబాటులో ఉంచాలి. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు.
– పి.వెంకటరమణ, డీటీవో, భద్రాద్రి