ఖమ్మం ఎడ్యుకేషన్, సెప్టెంబర్ 19 : ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా తొలుత ప్రధానోపాధ్యాయుల బదిలీలు విజయవంతంగా ముగిశాయి. ఎలాంటి ఆటంకాలు, అవాంతరాలు లేకుండా ఆరోపణలకు ఆస్కారమివ్వకుండా సజావుగా బదిలీ ప్రక్రియ కొనసాగింది. కలెక్టర్, స్కూల్ ఎడ్యుకేషనల్ ఉన్నతాధికారులు, ఆర్జేడీ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ ప్రొవిజనల్ జాబితాను రూపొందించగా, దానిని పరిశీలించి ఆమోదించిన జాబితాను విద్యాశాఖ వరంగల్ ఆర్జేడీ ధ్రువీకరణతో డీఈవో వెబ్సైట్లో ఉత్తర్వులు అందుబాటులో ఉంచారు. సోమవారం ఉదయానికే వెబ్ కౌన్సిలింగ్ ద్వారా జరిపిన ప్రక్రియలో ఏ ప్రధానోపాధ్యాయుడికి ఏ పాఠశాల కేటాయించబడిందో సెల్ఫోన్లకు సమాచారం వచ్చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో సోమవారం వినాయక చవితి సెలవు అయినప్పటికీ అత్యధిక మంది విధుల్లో చేరిపోయారు.
సెల్ఫ్ రిపోర్ట్..
ప్రధానోపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఆర్జేడీ బాధ్యుడు కావడంతో ఆర్జేడీ నుంచి వచ్చిన ఉత్తర్వులతో నేరుగా పాఠశాలల్లోనే రిపోర్ట్ చేయాలని సూచించారు. ఉమ్మడి ఖమ్మంజిల్లా పరిధిలో బదిలీ అయిన ప్రధానోపాధ్యాయులు సంబంధిత ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలల్లో సెల్ఫ్ రిపోర్ట్ చేశారు. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎంల్లో 12మంది వారు పనిచేస్తున్న పాఠశాల నుంచి వేరొక పాఠశాలకు బదిలీ అయ్యారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోని 104 మంది ప్రధానోపాధ్యాయులు బదిలీ ఉత్తర్వులు అందుకుని కొత్త పాఠశాలల్లో బాధ్యతలు స్వీకరించారు. ఆయా పాఠశాలల్లో రిజిష్టర్లో సంతకాలు చేసి విధుల్లో నిమగ్నమయ్యారు.
విజయవంతంగా…
ప్రధానోపాధ్యాయులు మల్టీజోన్-1 పరిధిలోకి రావడంతో ఇతర జిల్లాలకు చెందిన వారు తమ ఆప్షన్లు ఇచ్చుకుంటారు. గతంలో అయితే మ్యానువల్ పద్ధతిలో ఎన్నో అవాంతరాలు, ఎన్నో విభేదాలు, మరెన్నో భేదాభిప్రాయాలు నడుమ బదిలీలు జరిగేవి. లాబీయింగ్ చేసుకునేవాళ్లకు మాత్రమే మంచి స్థానాలు ఉండేవి, ఇతరులకు ఎక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థమయ్యేలోపు జరగాల్సిన నష్టం జరిగేది. కేటగిరీల ప్రాధాన్యత, ఇతర పాయింట్లు ఇవన్ని అనుకూలమైన వారికి మాత్రమే అమలుజరిగేవి. కానీ ప్రస్తుతం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంట్లో కూర్చోనే వెబ్ కౌన్సిలింగ్ విధానం ద్వారా ప్రక్రియ నిర్వహించారు. కరీంగనర్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం వంటి వివిధ జిల్లాకు చెందిన ప్రధానోపాధ్యాయులకు న్యాయం జరిగింది. మొత్తానికి తొలివిడతలోని హెచ్ఎంల బదిలీలు విజయవంతంగా పూర్తయ్యాయి.
బదిలీల తర్వాత ఎస్ఆర్లోకి…
బదిలీల్లో పాఠశాలలు మారిన ప్రధానోపాధ్యాయులు నేరుగా పాఠశాలల్లో రిపోర్ట్ చేయడంతో వారికి సంబంధించిన సర్వీస్ రికార్డ్సులో నమోదు చేయనున్నారు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అందరి ఎస్ఆర్లోకి అధికారులే ఒకరోజు సమయం కేటాయించి మార్పులకు సంబంధించిన వివరాలు పొందుపర్చనున్నారు. అత్యధిక శాతం ప్రధానోపాధ్యాయులు ఉదయం సమయానికి పాఠశాలలకు రాగా, ఇతర ప్రాంతాలకు చెందిన వారు సాయంత్రం వరకు రిపోర్ట్ చేశారు.
ఎలాంటి ఆటంకాలు లేవు
ఎలాంటి ఆటంకాలు లేకుండా హెచ్ఎం ల బదిలీలు జరిగాయి. వెబ్ కౌన్సిలింగ్ విధానంలో అందరికీ న్యాయం జరిగింది. పైరవీలకు అవకాశం లేకుండా కోరుకున్న స్థానాలు లభించాయి. కార్యాలయాల చు ట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా పో యింది. కంప్యూటర్ల సాయంతో ఇంటి వద్దే బదిలీలకు సంబంధించిన దరఖాస్తులు, ఆప్షన్లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు భద్రా ద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేసి ఖమ్మం జిల్లాకు వచ్చాను.
– కే మంజుల, హెచ్ఎం, ఇందిరానగర్ ఉన్నత పాఠశాల
పారదర్శకంగా బదిలీలు
రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎంల బదిలీల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది. ప్రధానోపాధ్యాయుల అన్ని సందేహాలను నివృత్తి చేసింది. ఆప్షన్లకు మరో అవకాశం సైతం కల్పించి పారదర్శకంగా బదిలీలు ముగించారు. ప్రాధాన్యత, పాయింట్ల ఆధారంగా పాఠశాలలను కేటాయించారు. ఇప్పటివరకు ఖమ్మం నగరంలోని రిక్కాబజార్ ఉన్నత పాఠశాలలో పనిచేశా.. చింతకాని మండలం నాగులవంచ పాఠశాలకు బదిలీ అయ్యాను.
– కనపర్తి వెంకటేశ్వర్లు, హెచ్ఎం, నాగులవంచ హైస్కూల్