రఘునాథపాలెం, మే 23 :ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో ‘ఫైనాన్స్ క్లియరెన్స్’ మాయాజాలం వెలుగుచూసింది. ఈ విషయంలో ఏకంగా కార్యాలయ ఉద్యోగులు ఇద్దరు, ఆర్టీఏ ఏజెంట్ ఒకరు పోలీసుల అదుపులో ఉండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సాధారణంగా ఓ వ్యక్తి ఫైనాన్స్ ద్వారా వాహనాన్ని కొనుగోలు చేస్తే.. ఆ రుణం తీరే వరకూ ఆ వాహన పత్రాలపై ఆ ఫైనాన్స్ సంస్థ పేరే ఉంటుంది. ఈఎంఐలు పూర్తిగా చెల్లించాక, రుణం మొత్తం తీరిపోయాక ఫైనాన్స్ సంస్థకు వెళ్లి క్లియరెన్స్ పత్రాలను తెచ్చుకుని రవాణా శాఖ కార్యాలయంలో చూపించి ఫైనాన్స్ క్లియరెన్స్ చేయించుకుంటాం. అప్పటి నుంచి ఆ వాహనంపై ఫైనాన్స్ సంస్థ పేరు తొలగిపోతాయి.
ఆ వాహనాన్ని కొనుగోలు చేసిన వ్యక్తికి పూర్తి హక్కులు సంక్రమిస్తాయి. కానీ, ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో ఇందుకు భిన్నంగా జరిగింది. ఫైనాన్స్‌పై వాహనాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి.. ఒకటీ రెండు ఈఎంఐలు మాత్రమే చెల్లించి, ఆర్టీఏ ఏజెంట్ ద్వారా తప్పుడు పత్రాలు సృష్టించి, ఫైనాన్స్ క్లియరెన్స్ పొంది, దానిని మరో వ్యక్తికి విక్రయించాడు. అలా మరో ఇద్దరి చేతుల్లోకి ఆ వాహనం మారినా.. సదరు వ్యక్తులు కూడా ఇదే విధానం ద్వారా ఫైనాన్స్ క్లియరెన్స్ పొందారు. చివరికి ఓ ఫైనాన్స్ సంస్థ గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
కారు కొనుగోలు నుంచి ఏం జరిగింది..
ఖమ్మానికి చెందిన చెందిన షేక్ సయ్యదున్నీసా బేగం ఖమ్మానికి చెందిన ఓ షోరూంలో కారును కొనుగోలు చేసింది. లక్ష్మీ ప్రైవేటు సంస్థ ద్వారా ఫైనాన్స్ తీసుకొని 48 నెలలపాటు ఈఎంఐలు నిర్దేశించుకుంది. 2024 డిసెంబర్ 23న ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో ఆ కారును రిజిస్ట్రేషన్ చేయించుకోగా టీజీ 04సీ 3188 నంబరు అలాట్ అయింది. రెండు నెలల పాటు సక్రమంగా ఈఎంఐలు కట్టిన సదరు కారు యజమాని.. ముందస్తు ప్లాన్ ప్రకారం.. మౌలానా అనే ఆర్టీఏ ఏజెంటును ఆశ్రయించారు. దీంతో సదరు ఏజెంట్.. లక్ష్మీ ప్రైవేటు సంస్థ నుంచి కారుపై తీసుకున్న రుణం క్లియరెన్స్ అయినట్లుగా పత్రాలు సిద్ధం చేశాడు. ఇకేముంది.. కారు యజమాని సయ్యదున్నీసా బేగం ఆ కారును షబ్బీర్ అనే వ్యక్తికి విక్రయించింది. ఫైనాన్స్ క్లియరెన్స్‌తోపాటు, షబ్బీర్ పేరుతో 2025 మార్చి 19న రిజిస్ట్రేషన్ సైతం చేయించింది.
షబ్బీర్ కూడా కొద్దిరోజులకు తిరిగి శ్రీరామ్ ఫైనాన్స్‌లో రీ-ఫైనాన్స్ తీసుకున్నాడు. అతడు కూడా రెండు నెలల ఈఎంఐలు చెల్లించిన తరువాత.. ఆర్టీఏ ఏజెంటు సహాయంతో సదరు శ్రీరామ్ ఫైనాన్స్ ఈఎంఐలు కూడా పూర్తయినట్లుగా ఫైనాన్స్ క్లియరెన్స్ పత్రాలు తెప్పించుకున్నాడు. వాటితో షబ్బీర్ ఆ కారును షేక్ సుభానీకి విక్రయించాడు. 2025 జూలై 14న ఫైనాన్స్ క్లియరెన్స్‌తోపాటు రిజిస్ట్రేషన్ చేయించాడు. అనంతరం ఆ కారు కొనుగోలు చేసిన మూడో వ్యక్తి సుభానీ సైతం హైదరాబాద్ వ్యక్తికి ఆ కారును విక్రయించి ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు క్లియరెన్స్ తీసుకొని 2025 నవంబర్ 18న హైదరాబాద్‌కు బదిలీ రిజిస్ట్రేషన్ చేయించాడు. ప్లాన్ పూర్తయిందనుకొని అందరూ మిన్నకుండిపోయారు.
పోలీసుల అదుపులో..
ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులైన మొదటి కారు యజమాని షేక్ సయ్యదున్నీసా బేగం భర్తను, రెండు ఫైనాన్స్ సంస్థలిచ్చిన రూ.10 లక్షల పైచిలుకు రుణం చెల్లించకుండానే తప్పుడు క్లియరెన్స్ పత్రాలతో తప్పుదోవ పట్టించిన ఏజెంటు మౌలానాను, మొదటి కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. పత్రాలను చూడకుండా గుడ్డిగా ఫైనాన్స్ క్లియరెన్స్ జారీ చేసిన ఉద్యోగులపైనా వేటు పడే అవకాశం ఉందని కార్యాలయంలో చర్చ జరుగుతోంది.
శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ ఫిర్యాదుతో వెలుగులోకి..
తన సంస్థ నుంచి కారుపై రుణం తీసుకున్న షబ్బీర్ ఈఎంఐలు చెల్లించకుండానే పత్రాలను క్లియరెన్స్ చేయించుకోవడంతో శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఖమ్మం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. తాజాగా ఖమ్మం రవాణా శాఖ కార్యాలయానికి చెందిన సునీల్, నదీమ్ అనే ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. షోరూం నుంచి కొత్తగా కారు కొనుగోలు చేసిన 10 నెలల్లోనే రెండు ఫైనాన్స్ సంస్థలకు ఎలాంటి ఈఎంఐలు చెల్లించకుండానే ఖమ్మం రవాణా శాఖ కార్యాలయం వేదికగా ఇద్దరు వ్యక్తులపై రెండుసార్లు రిజిస్ట్రేషన్లు జరగడం, రెండు ఫైనాన్స్ సంస్థలు ఇచ్చిన ఫైనాన్స్ క్లియర్ అయినట్లు ఆర్సీ పత్రాలు వచ్చిన వ్యవహారం బట్టబయలైంది.