బోనకల్లు, ఏప్రిల్ 4 : ప్రజా పాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న కుటుంబాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో శుక్రవారం బోనకల్లు మండల వ్యాప్తంగా 22 గ్రామాల్లో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా తాసీల్దార్ అనిశెట్టి పున్నం చందర్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో అర్హులు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు.
ఈ దరఖాస్తులను గ్రామాల వారీగా రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా 2,988 మంది కుటుంబాలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. వారి వివరాలను స్వయంగా పరిశీలించి సంబంధిత ఆధారాలను తీసుకుని మొబైల్ యాప్ లో నమోదు చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు నవీన్, మైతిలి, నాగార్జున రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.