బోనకల్లు, ఏప్రిల్ 9 : ఉచిత సైకిళ్లు తీసుకోవడానికి వచ్చిన పాఠశాల విద్యార్థులు డిప్యూటీ సీఎం పర్యటన షెడ్యూల్లో మార్పులు జరగడంతో ఎండ తీవ్రత, ఉక్కపోతతో టెంట్ల కింద తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పాఠశాల నుంచి పంపిణీ కేంద్రం వరకు ఆటోల్లో వచ్చిన విద్యార్థినులు ఆకలితోనే ఇంటిబాట పట్టారు. ఈ ఘటన బోనకల్లు రైతు వేదిక వద్ద గురువారం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా మండలంలోని 11 ఉన్నత పాఠశాలల విద్యార్థినులు 777 మందికి ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఈ క్రమంలో ఆయా పాఠశాలల విద్యార్థినులను ఉదయం 10:30 గంటలకే ఉపాధ్యాయులు ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా రైతు వేదిక వద్దకు తరలించారు. అయితే డిప్యూటీ సీఎం పర్యటన షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు జరగాల్సి ఉండగా.. దానిని ఉదయం 11 గంటలకు మార్చారు. అయితే మధ్యాహ్నం 1:15 దాటినా డిప్యూటీ సీఎం రాకపోవడంతో విద్యార్థినులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పాఠశాలల్లో మధ్యాహ్నం 12 గంటలకే భోజనం చేసే విద్యార్థినులకు ఇక్కడ ఎలాంటి భోజన సౌకర్యాలు కల్పించలేదు. ఎండ తీవ్రత దృష్ట్యా గ్లాసు మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి వారిని టెంట్ల కింద కూర్చోబెట్టడంతో ఎండ వేడికి నీరసించిపోయారు.
చివరికి మధ్యాహ్నం 1:15 నిమిషాలకు డిప్యూటీ సీఎం రైతు వేదిక వద్దకు చేరుకొని సైకిళ్లు పంపిణీ చేసి వెళ్లిపోయారు. కాగా, తమ పిల్లలను గంటల తరబడి టెంట్ల కింద కూర్చోబెట్టడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కనీసం భోజన వసతి కూడా కల్పించకపోవడం అధికారుల బాధ్యతా రాహిత్యమేనని కాంగ్రెస్ నాయకురాలు చేబ్రోలు ద్రౌపతితోపాటు కొందరు నాయకులు అసహనం వ్యక్తం చేశారు.ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో విద్యార్థినులను ఎండలో ఇబ్బందులకు గురి చేయడం సరికాదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.