ఖమ్మం వ్యవసాయం, జనవరి 3: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరల పరిస్థితి రెండు రోజులుగా చిత్ర విచిత్రంగా కనిపిస్తున్నది. సాధారణంగా మిర్చి ధర కంటే కోల్డ్ స్టేరేజీలలో నిల్వ చేసిన పంటకే మంచి ధర పలికేది. కానీ.. ఈ ఏడాది మాత్రం ఏసీలో నిల్వ చేసిన పంటకంటే ఈ వానకాలం సాగు చేసిన పంటకే ఎక్కువ ధర పలుకుతుండడం విశేషం.
గత ఏడాది మిర్చి సీజన్లో వందలాది మంది రైతులు, కొందరు మిర్చి ఖరీదుదారులు పంటను భారీగా కోల్డ్ స్టోరేజీలలో నిల్వ పెట్టారు. అప్పుడు మార్కెట్లో క్వింటా గరిష్ట ధర రూ.19 వేలు పలికింది. రాబోయే రోజుల్లో మరింత ధర పెరిగే అవకాశం ఉందనే భావనతో జిల్లావ్యాప్తంగా 40 కోల్డ్ స్టోరేజీలలో 42 లక్షల బస్తాల మిర్చిని నిల్వ చేశారు.
సరిగ్గా ఏడాది తిరిగే సరికి ప్రస్తుతం మార్కెట్లో మిర్చి ధర గణనీయంగా తగ్గిపోయింది. శుక్రవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని మిర్చి యార్డుకు వివిధ జిల్లాల నుంచి 2,288 బస్తాల మిర్చిని రైతులు విక్రయానికి తీసుకొచ్చారు. ఉదయం జరిగిన జెండాపాటలో కొత్త రకం మిర్చి పంటకు గరిష్ట ధర క్వింటా రూ.15,800 పలుకగా, మధ్య ధర క్వింటా రూ.15 వేలు, కనిష్ట ధర రూ.6 వేల చొప్పున ఖరీదుదారులు కొనుగోలు చేశారు. అలాగే ఏసీ రకం మిర్చి పంట క్వింటా ధర రూ.15,500 పలికింది. సీజన్ ఆరంభంలోనే కొత్త మిర్చికి సైతం కనిష్ట ధర పలుకుతుండడంతో సాగు రైతులు ఆందోళన చెందుతున్నారు.