సన్నరకం వరి ధాన్యానికి క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామంటూ హామీనిచ్చి అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కర్షకులను నిలువునా మోసం చేస్తోంది. ఖమ్మం జిల్లాలోని సుమారు 18 వేలమందికిపైగా రైతులు గత యాసంగిలో 1.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయిస్తే.. అందుకు చెల్లించాల్సిన రూ.65 కోట్ల బోనస్‌ను రేవంత్ ప్రభుత్వం ఇంత వరకూ జమ చేయలేదు. పైగా, ఈ ఏడాది వానకాలం సీజన్ వరి పంట కోతలకు వచ్చినా, ఈ ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం ఇంకా బోనస్ చెల్లించకుండా అన్నదాతలను ఆర్థికంగా ఇబ్బందులు పెడుతోంది.
యాసంగి బోనస్ నగదు వస్తే వానకాలం పంటల సాగుకు వినియోగించుకుందామని అనుకున్న అన్నదాతలకు కాంగ్రెస్ సర్కారు నిరాశే మిగిల్చింది. యాసంగి ధాన్యాన్ని విక్రయించి మూడు నాలుగు నెలలు గడుస్తున్నా కనీస కనికరం లేకుండా ఇంత వరకూ జమ చేయకపోవడంపై కర్షకులు గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వెళ్లి అష్టకష్టాలూ పడి ధాన్యాన్ని విక్రయిస్తే.. బోనస్ వస్తుందన్న గ్యారెంటీ లేనందున వెనువెంటనే చేతిలో నగదు పడే ప్రైవేటు వైపే అన్నదాతలు చూస్తుండడం గమనార్హం.
-రఘునాథపాలెం, అక్టోబర్ 14
క్వింటాకు రూ.500 వస్తుందనుకుంటూ ఆశగా ఎదురుచూస్తున్న ఖమ్మం జిల్లా రైతులకు రేవంత్ ప్రభుత్వం నిరాశే మిగిల్చింది. బోనస్ నగదు వస్తే వానకాలం సీజన్ పెట్టుబడికి ఉపయోగించుకుందామనుకున్న అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. గత యాసంగి ముగిసినా, ఈ వానకాలం వరి కోతలు సమీపిస్తున్నా బోనస్ నగదు ఖాతాల్లో జమకాని రైతుల ఆగ్రహం ఆకాశాన్నంటుతోంది. దీంతో తమ ధాన్యాన్ని ఈ సారి ప్రైవేటులో విక్రయించే ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో వానకాలం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులు కార్యాచరణ ప్రారంభించినా, కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేస్తున్నా అన్నదాతల్లో పెద్దగా చలనం కన్పించడం లేదు. దీంతో ఈసారి ప్రభుత్వం చేసే ధాన్యం కొనుగోళ్లపై బోనస్ బకాయిల ప్రభావం పడే అవకాశం స్పష్టంగా కన్పిస్తోంది.
‘బోనస్’ అనడంతో..
మద్దతు ధరతోపాటు సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ కూడా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో ఖమ్మం జిల్లా రైతులు భారీగా సన్న ధాన్యాన్ని సాగు చేశారు. ఈ వానకాలంలోనూ పెద్ద మొత్తంలోనే సన్న ధాన్యం వస్తుందని అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. కానీ, గత యాసంగి బోనస్ ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు. అనేక కష్టాలకోర్చి సొసైటీలు, ఐకేపీ కేంద్రాల్లో తాము ధాన్యాన్ని విక్రయిస్తే ధాన్యం డబ్బుల చెల్లింపులను ప్రభుత్వం ఆలస్యం చేయడం, బోనస్ చెల్లింపుల్లో విఫలం కావడం వంటి కారణాలతో ఈ వానకాలం సీజన్లో అత్యధిక శాతం మంది రైతులు ప్రైవేటు వ్యాపారుల వైపు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
యాసంగిలో 1.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
ఖమ్మం జిల్లాలో వరిసాగు గణనీయంగా పెరగడంతో ఈ వానకాలంలోనూ రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత యాసంగిలో జిల్లాలో 18,893 మంది రైతుల నుంచి 1.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేశారు. కానీ, జిల్లాలో ఇంకా 18 వేల పైచిలుకు రైతులకు సుమారు రూ.65 కోట్ల బోనస్‌ను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. యాసంగి ముగిసి నెలలు గడిచిపోతున్నా, వానకాలం పంటలు కోతలకు వచ్చినా ప్రభుత్వం ఇంకా బోనస్ ఇవ్వకపోవడంపై అన్నదాతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రైవేటువైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అవస్థలు పడే పరిస్థితీ ఉందని అంటున్నారు.
కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేశాం..
జిల్లాలో వానకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్రాలను సిద్ధం చేశాం. ఈ సీజన్‌కు జిల్లావ్యాప్తంగా 327 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. గత సీజన్లో 1.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం. ఈ సీజన్లో విస్తీర్ణం పెరగడంతో దిగుబడి కూడా పెరుగుతుంది. కొనుగోళ్లూ పెరుగుతాయి. గత యాసంగి బోనస్ నగదు రూ.65 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం.
-చందన్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారి, ఖమ్మం
బోనస్ నగదు ఇంకా జమకాలేదు..
గత యాసంగి సీజన్లో ఐకేపీ కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించాను. క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో నేను ఎంతో ఆశతో మొత్తం 48 క్వింటాళ్ల ధాన్యాన్ని ఐకేపీ కేంద్రం ద్వారా ప్రభుత్వానికి విక్రయించాను. బోనస్ నగదు వస్తే వానకాలం పంటల పెట్టుబడికి ఉపయోగించుకుందామని అనుకున్నాం. కానీ, ఇన్ని నెలలు గడిచిపోయినా ఆ బోనస్ నగదు మాత్రం ఇంకా జమ కాలేదు. అధికారులను అడిగితే ప్రభుత్వం నుంచి ఇంకా రాలేదంటున్నారు.
-మేచర్ల నాగేశ్వరరావు, రైతు, వేపకుంట్ల, రఘునాథపాలెం