బోనకల్లు, మే 09 : రైతులెవరూ అధైర్య పడొద్దని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని మధిర వ్యవసాయ సబ్ మార్కెట్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. మిల్లర్లు సన్నధాన్యాన్ని కొనుగోలు చేయడానికి రావడం లేదని, కాంటాలు వేయడం లేదని, ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు.
వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షం కారణంగా ధాన్యం తడవకుండా కాపాడుకోవడమే సరిపోతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. రైతుల నుంచి కొనుగోలు చేయడం కోసమే కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులతో మాట్లాడి ప్రతి గింజను కొనుగోలు చేయాలని ఆదేశించినట్లు రైతులకు వివరించారు. రైతులు నష్టపోకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసి లారీలు ఎగుమతి చేసే బాధ్యత తాను తీసుకుంటానని, రైతులు అధైర్య పడవద్దని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు గాలి దుర్గారావు, ఐకేపీ అధ్యక్షురాలు రేణుక పాల్గొన్నారు.