కారేపల్లి, ఏప్రిల్ 03 : లాభదాయక మామిడి పంటను రైతులు అధికంగా సాగు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామంలో బానోత్ లక్ష్మణ్ సాగు చేస్తున్న కార్భైడ్ రహిత మామిడి పంటను గురువారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుతో మాట్లాడి గతంలో పంటల సాగు విధానం, ప్రస్తుతం ఎంత విస్తీర్ణంలో మామిడి పంట వేశారు, అంతర్ పంటల సాగు, దిగుబడి విధానం, నీటి వనరుల లభ్యత వంటి వివిధ అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మామిడి సాగు విధానం, అధిక దిగుబడికి తీసుకుంటున్న చర్యలు, మార్కెటింగ్ విధానాన్ని రైతును అడిగి తెలుసుకున్నారు. మామిడి సాగుకు రైతులు ఆసక్తి చూపేందుకు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, అందించాల్సిన తోడ్పాటు వివరాలను అధికారులతో పాటు రైతును అడిగి తెలుసుకున్నారు. లక్ష్మణ్ ని ఆదర్శంగా తీసుకుని నేటి యువ రైతులు లాభదాయక పంటలపై ఆసక్తి చూపాలన్నారు.
గ్రామంలో ఉన్న రెవెన్యూ సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను రైతులు స్వదినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ రాంగోపాల్ రెడ్డి, మండల ప్రత్యేకాధికారి మధుసూదన్, ఏడీఏ వెంకటేశ్వరరావు, తాసీల్దార్ సుధాకర్, ఎంపీడీఓ రవీందర్, ఏఓ తారాదేవి, ఏఈ శ్రీనివాసులు, ఆర్డబ్ల్యూఎస్ జేఈ సతీశ్, ఉద్యాన అధికారి వేణు, శ్రావణి, ఆర్ఏ సక్రు, ఎంపీఓ ప్రభాకర్ రెడ్డి, ఏఈఓ ఉషా, జగదీశ్వర్, సూపర్వైజర్ వెంకటమ్మ, అంగన్వాడీ టీచర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Mango Farmers : రైతులు లాభదాయక మామిడి సాగు చేపట్టాలి : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్