పంటల రుణమాఫీ ప్రక్రియపై పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యల్లో భాగంగా మరో దారి ఎంచుకుంది. రేపటి నుంచి జిల్లాలో వ్యవసాయశాఖ అధికారులు ఇంటింటి సందర్శన చేయనున్నారు. గడిచిన నెలరోజుల నుంచి జిల్లాలో ఎక్కడ చూసినా రుణమాఫీపై రైతులు విరుచుకుపడుతున్నారు. కొంతమంది రైతులకు రుణమాఫీ కావడం, మరికొందరికి కాకపోవడంతో సదరు రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే తమకు పూర్తి అర్హత ఉన్నా పంటల రుణమాఫీ కాకపోవడంతో నిత్యం వందలాది మంది రైతులు మండల వ్యవసాయశాఖ అధికారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో తప్పొప్పులను సరిదిద్దేందుకు గాను ప్రభుత్వం ఇప్పటికే ఒక్కటి కాదు.. రెండు కాదు అనేక వేదికల ద్వారా ఫిర్యాదులను స్వీకరించింది. రైతువేదికల ద్వారా ఏఈవోలు ఫిర్యాదులు స్వీకరించగా, గ్రీవెన్స్ ద్వారా మండల, జిల్లా అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు. అదేవిధంగా టోల్ ఫ్రీ, ప్రత్యేక సెల్‌నెంబర్‌కు సైతం ఆన్లైన్లో అనేక ఫిర్యాదులు పోటెత్తాయి.
మొత్తంగా ఖమ్మం జిల్లాలో 20వేల పైచిలుకు ఫిర్యాదులు రావడం జరిగింది. తాజాగా గడిచిన మూడురోజుల నుంచి మండల వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేక ఫార్మాట్ ద్వారా ఫిర్యాదుల దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయినప్పటికీ సమస్యలకు చెక్ పడకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వీకరించిన ఫిర్యాదులతోపాటు, ఉన్నతాధికారులు ప్రత్యేక జాబితాలను గ్రామాల వారీగా ఈ సైట్లో పొందుపరుస్తారు. ఈ యాప్ ముఖ్యఉద్దేశం కేవలం కుటుంబ నిర్దారణ కోసమేనని తెలుస్తున్నది.
జిల్లావ్యాప్తంగా వ్యవసాయశాఖ అధికారులు బుధవారం నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్ర, శనివారాల్లో మండల వ్యవసాయశాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా ప్రయోగాత్మకంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఏవోలు ఎంపిక చేసుకున్న గ్రామాల్లో ఒకటీ రెండు కుటుంబాల వివరాలను సేకరించి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ప్రత్యేక వెట్సైట్లో పొందుపరిచారు.
మొత్తం 8 రకాల అంశాలను సేకరించారు. అదేవిధంగా కుటుంబ యజమాని సంతకంతోపాటు ఆ ఇంటి కుటుంబసభ్యులతో ఓ సెల్ఫీ సైతం దిగి అప్లోడ్ చేశారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రక్రియ ముగియడంతో ఇక ప్రత్యక్షంగా రంగంలోకి దిగనున్నారు. కేవలం కుటంబ నిర్ధారణకు సంబంధించిన ప్రక్రియ మాత్రమే చేపట్టనున్నారు. పంటల రుణాలు తీసుకున్నవారికి రేషన్‌కార్డులు లేని కుటుంబాలు, ఒకే ఇంటిలో ఒకే రేషన్‌కార్డులో తండ్రి, కొడుకు లేదా కూతురు కుటుంబసభ్యులు ఉన్నట్లయితే సదరు కుటుంబ సభ్యులను విడివిడిగా చూపెట్టాల్సి ఉంది.
తద్వారా ఇరు కుటుంబాలకు రుణమాఫీ వర్తింపచేయనున్నారు. బీఆర్ఎస్ నాయకులు గత కొద్దిరోజుల నుంచి ఇదే అంశంపై పోరాటం చేస్తుండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చి కుటుంబ నిర్ధారణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. దీంతో నేడు లేదా రేపటి నుంచి గ్రామాల్లో వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు.
పంటల రుణమాఫీ కాకపోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. కుటుంబ నిర్ధారణతోపాటు ఆధార్‌కార్డు నెంబర్, రుణగ్రహీతల పేర్లు, చిరునామాలు, ఇతర అనేక పొరపాట్లు దొర్లాయి. వీటిని సవరించాలని కోరుతూ రైతులు దరఖాస్తులు సైతం అందజేశారు. అయితే సాంకేతిక అంశాల విషయంలో వ్యవసాయశాఖ అధికారులకు ఇప్పటికీ స్పష్టత లేదని చెప్పవచ్చు.
ఈ అంశాలను సరిదిద్దే అధికారం ఏవోలకు ఇస్తారా లేదా అనేది స్పష్టతలేదు. ఇకపోతే ఏవో లాగిన్‌లోనే కుటుంబ నిర్ధారణ జరుగుతుందా, ఏఈవోలకు సైతం లాగిన్ ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. వీటికి తోడు కుటుంబాలు వేర్వేరు అని గ్రామ పంచాయతీ సెక్రటరీ ధ్రువీకరణ చేస్తారా, రెవెన్యూ అధికారులకు బాధ్యత ఇస్తారా లేదా వ్యవసాయశాఖ అధికారులకే నిర్ణయం వదిలేస్తారా అనేది ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది.
కుటుంబ నిర్ధారణతోపాటు సాంకేతిక పొరపాట్లకు సైతం చెక్‌పెట్టని యెడల గ్రామాల్లో రైతులు మరింత ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. ఈ సందేహాల నివృత్తికి గాను మంగళవారం ఎంపిక చేసిన రైతువేదికల్లో ‘రైతునేస్తం’ పేరుతో అవగాహన కార్యక్రమం జరగనున్నది. దీంతో వీడియో కాన్ఫరెన్స్‌లోనే రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.