కొణిజర్ల, ఆగస్టు 26 : ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు రైతులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం(ఏఐపీకేఎస్) జిల్లా కార్యదర్శి ఆవుల వెంకటేశ్వర్లు తెలిపారు.
సింగరాయపాలెం, తీగలబంజర గ్రామాల్లో సోమవారం జరిగిన సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, రైతుభరోసా ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని, పంటల బీమా పథకం, రైతు పంటకు మద్దతు ధర ఉంటే క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తామని చెప్పిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇందుకోసం మంగళవారం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమానికి రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐపీకేఎస్ వైరా డివిజన్ కార్యదర్శి పాశం అప్పారావు, డివిజన్ నాయకులు తడికమళ్ల సీతారాములు, మేడి కొండలరావు, కంకణాల పెద్దవెంకటి, చిన్నవెంకటి, నూనావత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.