ఖమ్మం రూరల్, ఏప్రిల్ 10: యాభై ఏళ్లకు పైబడి సాగు చేసుకుంటున్న తమ పంట భూములను ప్రభుత్వం లాక్కోవద్దని కోరుతూ టెంట్లు వేసి రైతులు నిరసనకు దిగారు. పోలీసుల సహకారంతో జేసీబీలు, బుల్డోజర్లతో అధికారులు అక్కడికి చేరుకోవడం.. తమ భూముల జోలికి రావొద్దని రైతులు ప్రాధేయపడడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రైతులు జేసీబీలను అడ్డుకొని ధర్నాకు దిగారు. ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలం పోలెపల్లిలో గురువారం చోటు చేసుకుంది.
పోలెపల్లి సమీపంలోని మున్నేరు వాగు రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపట్టిన భూముల్లో ఉదయం 10 గంటల నుంచి టెంట్లు వేసి వంద మంది రైతులు నిరసన చేపట్టారు. తాము సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవద్దని అధికారులను కోరారు. ఈ క్రమంలో అధికారులు జేసీబీలు, బుల్డోజర్లతో అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రైతులు జేసీబీలు, బుల్డోజర్లను అడ్డుకున్నారు. అప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ ఎస్సై అనిల్, పోలీస్ సిబ్బందికి రైతులు రెండు చేతులు జోడించి దండం పెట్టారు. తమ భూముల జోలికి రావొద్దని వేడుకున్నారు.
పెళ్లిళ్ల సమయంలోనే తమ కుమార్తెలకు పసుపు, కుంకుమ కింద రాసిచ్చామని ప్రాథేయపడ్డారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. చివరికి ‘రెండు రోజుల సమయం ఇస్తున్నాం. ఈలోగా నిర్ణయం తీసుకోవాలి’ అని రైతులకు పోలీసు అధికారులు సూచించారు. తర్వాత అక్కడి నుంచి బుల్డోజర్లు, జేసీబీలు వెళ్లిపోవడంతో రైతులు శాంతించారు. సీపీఎం మండల కార్యదర్శి ఊరడి సుదర్శన్‌రెడ్డి అక్కడికి చేరుకుని రైతులకు మద్దతు తెలిపారు.