కాంగ్రెస్ సర్కారుపై తిరుగుబాటు మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సబ్బండ వర్గాల ప్రజలూ ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆయా వర్గాల ప్రజలు, సంఘాల నాయకులు, పార్టీల నేతలతోపాటు కాంట్రాక్టర్లు, అధికారులు, సాధారణ ప్రజలు, పేదలు ఇటీవల చేపడుతున్న నిరసనలే ఇందుకు నిదర్శనంగా కన్పిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాక్షాత్తూ సోమవారం జరిగిన ధర్నాలు, నిరసన ర్యాలీలు ప్రత్యక్ష సాక్షంగా ఉన్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సింగరేణిలో ఏకంగా అధికారులు దీక్షలకు దిగడం గమనార్హం. వచ్చే నెల 13లోగా తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్షలకు కూడా సిద్ధమంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపుతున్నారంటే సర్కారుపై ఆ అధికారులు ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇక విద్యుత్ ప్లాంట్ల ప్రైవేటీకరణను నిరసిస్తూ కొన్ని వారాలుగా విద్యుత్ కార్మికులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. జెన్కోలోని కేటీపీఎస్, బీటీపీఎస్ ఉద్యోగులతోపాటు ట్రాన్స్‌కోలోని ఉద్యోగులు సైతం రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తుండడం విశేషం. ఇక, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో పేదలంతా వెళ్లి సత్తుపల్లి ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. అలాగే, యాప్ ఎత్తివేసి యూరియాను నేరుగా తమకే ఇవ్వాలంటూ ఇల్లెందులో రైతులు అక్కడి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. చివరికి.. పాఠశాల అభివృద్ధి, మరమ్మతు పనులు చేసిన తనకు ఇంత వరకూ బిల్లులు చెల్లించలేదంటూ ఓ కాంట్రాక్టర్ వచ్చి ఏకంగా సర్కారు బడి గేటుకు తాళం వేయడం.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విధానానికి అద్దం పడుతోంది.
పాల్వంచ/ మణుగూరు టౌన్, జూన్ 29: నల్గగొండ జిల్లాలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) యాష్, కోల్ ప్లాంట్ల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తూ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ, తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీల ఆధ్వర్యంలో పాల్వంచ, మణుగూరులో సోమవారం నిరసన ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. పాల్వంచ కేటీపీఎస్ ఉద్యోగులు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి అంబేద్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు.

తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలి నుంచి బైక్ ర్యాలీగా కేటీపీఎస్‌లోని అన్ని కర్మాగారాల వరకు భారీ ర్యాలీ చేపట్టారు. మణుగూరు బీటీపీఎస్‌లో తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ (టీజీపీఈ) జాక్ ఆధ్వర్యంలో ప్రధాన గేటు ఎదుట గేట్ మీటింగ్ నిర్వహించి, నిరసన తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో జేఏసీ నాయకులు పలువురు మాట్లాడుతూ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో ఒకటైన వైటీపీఎస్ను జెన్కో ఆధ్వర్యంలో సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉన్నా యాజమాన్యం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. టెండర్ల రద్దు అయ్యేంత వరకు జాక్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తూనే ఉంటామని హెచ్చరించారు.
సత్తుపల్లి టౌన్, జూన్ 29: కాకర్లపల్లి పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి క్యాంపు కార్యాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. పేదలతో కలిసి సుమారు 250 మంది మహిళలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడికి వెళ్తున్నారనే విషయం తెలుసుకున్న పోలీసులు ఉదయం 5 గంటల నుంచే వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.

అయినప్పటికీ కొందరు తప్పించుకొని ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ క్రమంలో పోలీసులు మహిళలు అని చూడకుండా అడ్డుకొని బలవంతంగా లాక్కెళ్లి వాహనాల్లో పోలీస్‌సేషన్‌కు తరలించడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది.
ఇల్లెందు, జూన్ 29: యూరియా ఎరువును నేరుగా అందించాలని ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఇల్లెందు పట్టణంలో న్యూడెమోక్రసీ నాయకులతో కలిసి రైతులు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యూరియాను ఆన్లైన్ యాప్ ద్వారా ఇస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సకాలంలో విత్తనాలు, పురుగుమందులు అందించాలని, యూరియా యాప్‌ను రద్దు చేయాలని, ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతులందరికీ రైతుభరోసా ఇవ్వాలని, రెండు లక్షల రుణమాఫీ చేయాలని కోరారు. నాయకులు పాల్గొన్నారు.
రఘునాథపాలెం, జూన్ 29: చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ పాఠశాలకు తాళం వేసిన ఘటన ఖమ్మం దానవాయిగూడెం మండల పరిషత్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాఠశాలలో రూ.20 లక్షల విలువైన పలు అభివృద్ధి, మరమ్మతు పనులను గుత్తేదారు చల్లా అయోధ్య చేపట్టింది. ఇందులో రూ.10 లక్షల బిల్లు చెల్లించగా.. మిగితా బిల్లు రూ.10 లక్షలు చెల్లించాలని అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు.

దీంతో విసిగిపోయిన గుత్తేదారు అయోధ్య సోమవారం ఉదయం పాఠశాల సమయానికి కంటే ముందే కుటుంబంతో సహా అక్కడికి చేరుకొని పాఠశాల గేటుకు తాళం వేసింది. విధులకు వచ్చిన ఉపాధ్యాయులు, పాఠశాలకు వచ్చిన విద్యార్థులను లోనికి వెళ్లనీయకుండా అడ్డుకోవడంతో వారంతా బయటే ఉండిపోయారు. అప్పు చేసి పనులు చేశానని, బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్యే శరణ్యం అంటూ పెట్రోల్ సీసాతో గేటు బయట కూర్చుని కుటుంబంతో నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న అర్బన్ ఎంఈవో శైలజాలక్ష్మి ఘటనా స్థలాన్ని సందర్శించారు. గుత్తేదారు అయోధ్యతో మాట్లాడారు. బిల్లు ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించింది.
కొత్తగూడెం సింగరేణి/ మణుగూరు టౌన్/ రుద్రంపూర్, జూన్ 29: సింగరేణి సంస్థవ్యాప్తంగా సోమవారం అధికారుల రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. తమ సమస్యలు పరిష్కరించాలని కోల్‌మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఎంవోఏఐ) సింగరేణి బ్రాంచి ఆధ్వర్యంలో సంస్థవ్యాప్తంగా ఉన్న అధికారులు దశలవారీ ఆందోళనలు చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మొండివైఖరి ప్రదర్శించడంతో దీక్షలు చేపట్టారు. సోమవారం మొదటిరోజు కొత్తగూడెం కార్పొరేట్, బొగ్గుగని ఏరియా, సత్తుపల్లి, మణుగూరు, ఇల్లెందు, భూపాలపల్లి, గోదావరిఖని, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, రామగుండం 1, 2, 3 ఏరియాల్లో దీక్షలు చేపట్టారు.

కొత్తగూడెం కార్పొరేట్లో సీఎంవోఏఐ సింగరేణి అధ్యక్షుడు లక్ష్మీపతిగౌడ్, కార్పొరేట్ అధ్యక్షుడు వెంకటాచారి, మెయిన్ ఆస్పత్రి డీవైసీఎంవో మాలతి, సీనియర్ అండర్ మేనేజర్ (పీపీ) రాంబాబు, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ వీరన్న, సీనియర్ సర్వే ఆఫీసర్ ఎస్టేట్స్ సర్వేశ్వరరావు దీక్షలో కూర్చున్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జూలై 13 వరకు రిలే నిరాహార దీక్షలు చేస్తామని, అప్పటివరకు సమస్యలు పరిష్కరించకపోతే ఆమరణ దీక్షలు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.