ఖమ్మం వ్యవసాయం, అక్టోబర్ 28 : పంట తాడికి పెరిగిన వేళ ఖరీదుదారులంతా ఏకమై ఒక్కసారిగా జెండా పాటను తగ్గించారు. దీంతో ఎన్నో ఆశలతో ఏఎంసీకి పంటను తెచ్చుకున్న పత్తి రైతులు విధిలేక అదే ధరకు విక్రయించుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం పత్తి బస్తాలు పోటెత్తాయి. కొద్ది రోజులుగా కేవలం 5 నుంచి 8 వేల పత్తి బస్తాలే వస్తున్నాయి. అయితే రెండురోజుల సెలవుల అనంతరం తిరిగి సోమవారం మార్కెట్లో క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి.
ఉదయం పత్తి యార్డులో జరిగిన ఆన్లైన్ బిడ్డింగ్ ఓపెనింగ్ సమయానికి వివిధ జిల్లాల నుంచి రైతులు సుమారు 35 వేల పత్తి బస్తాల పంటను తీసుకొచ్చారు. దీంతో బిడ్డింగ్‌లో గరిష్ఠ ధర క్వింటాకు రూ.6,800 పలికింది. మధ్య ధర రూ.6,600 కాగా, కనిష్ఠ ధర రూ.5,900 చొప్పున నిర్ణయించి ఖరీదుదారులు కొనుగోలు చేశారు. కొద్దిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం, పంట చేతికి వస్తుండడం, సీసీఐ కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడం వంటి కారణాలతో ప్రైవేట్ వ్యాపారుల వద్దకు పంట భారీగా వచ్చింది.
ఉదయం 9 గంటల సమయానికే పత్తి యార్డులోని నాలుగు ప్రధాన షెడ్లతోపాటు యార్డు ఆవరణ పూర్తిగా నిండిపోయింది. తరువాత కూడా పంట తాకిడి పెరగడంతో అపరాల యార్డులో షెడ్‌తోపాటు ప్రధాన వీధుల్లోనూ రైతులు తమ పత్తి బస్తాలను దిగుమతి చేశారు. దీంతో మార్కెట్ కమిటీ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్.. సిబ్బందిని అప్రమత్తం చేశారు. త్వరితగతిన కాంటాల ప్రక్రియ, తోలకాలు చేపట్టాలని ఆదేశించారు. అధిక మొత్తంలో యార్డుకు పంట రావడాన్ని అదునుగా భావించిన ఖరీదుదారులు.. తమ సంప్రదాయ సూత్రాన్ని అమలు చేశారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే సీక్రెట్ బిడ్డింగ్ అయినప్పటికీ ఒక్కరోజులోనే గరిష్ఠ ధర క్వింటాకు రూ.300 తగ్గించి మరోసారి తమ సిండికేట్ దందాను విజయవంతంగా అమలుచేశారు.
అయితే, సీసీఐ అధికారులు అనేక కొర్రీలు పెడుతుండడం వల్లనే రైతులు ఖమ్మం ఏఎంసీకి భారీగా పంటను తెస్తున్నారు. సీసీఐ కేంద్రాల కంటే ప్రైవేటులో రూ.1,000-రూ.1,500 ధర తక్కువగా ఉంటుందని తెలిసినా రైతులు ప్రైవేట్‌లోనే విక్రయిస్తున్నారు. సీసీఐకి విక్రయించాలంటే తేమ శాతం 8-12 మధ్య ఉండాలి. ప్రస్తుత పరిస్థితిలో ఆ తేమ శాతం నమోదు కావడం కష్టంగా ఉంది. దీంతో రైతులు ప్రైవేటు బాటపడుతున్నారు. అదీగాక వ్యవసాయ శాఖ పోర్టల్‌లో పంట సాగు నమోదై ఉండాలి. కౌలు రైతు అయితే ధ్రువపత్రాన్ని వెంట తెచ్చుకోవాలి. ఈ సవాళ్లను అధిగమించి పంటను విక్రయించినా సకాలంలో చెల్లింపులూ అనుమానమే. దీంతో చాలామంది రైతులు తమ పత్తి పంటను ప్రైవేట్ ఖరీదుదారులకే విక్రయిస్తున్నారు. అయితే ఆఖరుకు తమతోనే, తమ పేరిటే ఈ పత్తిని సీసీఐ కేంద్రాల్లో విక్రయింపజేసి ఖరీదుదారులు సొమ్ము చేసుకోవడం ఖాయమని రైతులు బహిరంగంగానే చెబుతున్నారు.
దాదాపుగా నాలుగేళ్ల తరువాత ఇంత భారీ మొత్తంలో పత్తి పంట మార్కెట్ యార్డుకు వచ్చిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. తెల్లవారే సరికి పత్తి యార్డంతా తెల్లబంగారంతో కళకళలాడుతుండడాన్ని చూసిన పత్తి ఖరీదుదారులు.. తక్షణమే తమ వ్యూహాలకు పదునుపెట్టారు. ప్రస్తుతం సీసీఐ ధర రూ.7,520గా ఉంది. దీనికి ఇంచుమించుగానే ప్రైవేట్ ధర కూడా ఉండాలి. కానీ.. ఖరీదుదారులు అమాంతంగా ధర తగ్గించడంతో పంటను తెచ్చిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ బిడ్డింగ్‌లో గరిష్ఠ ధరను కేవలం 6,700కు పరిమితం చేసి.. కొనుగోళ్లను మాత్రం రూ.6,500కు దిగువనే ఉంచి పంటను కొనుగోలు చేశారు. ‘ఇంత దారుణంగా ధర తగ్గిస్తారా?’ అని కొందరు రైతులు ప్రశ్నిస్తే.. ‘ఇష్టమైతే అమ్ముకో.. లేకపోతే ఇంటికి తీసుకపో..’ అంటూ బయ్యర్లు సమాధానమిచ్చారు. దీంతో దిక్కు తోచని స్థితిలో వారు చెప్పిన ధరకే రైతులు తమ పంటను విక్రయించారు.
ఈ ఏడాది సాగుకు పెట్టిన పెట్టుబడులు కూడా వెళ్లే పరిస్థితి లేదు. నేను ఆరు ఎకరాల్లో పత్తి వేశాను. మొదటితీతలో 22 బస్తాల పంట చేతికొచ్చింది. మంచి ధర పలకాలనే ఉద్దేశంతో పంటను ఆరబెట్టి మరీ తీసుకొచ్చాను. కానీ.. క్వింటాకు రూ.6,300 చొప్పునే ఖరీదుదారులు కొన్నారు. పెట్టుబడి ఇచ్చిన వాళ్లు ఆగట్లేదు కాబట్టి తప్పని పరిస్థితిలోనే అమ్ముకోవాల్సి వచ్చింది. ఇక ప్రభుత్వం నుంచి పంటల పెట్టుబడి కూడా రాలేదు.
-వాసం తిరుపతయ్య, రైతు, తెల్దారుపల్లి, ఖమ్మం రూరల్
ఇక్కడి వ్యాపారులు మా పంట నాణ్యతను చూడడం లేదు. వారు చెప్పిందే ధర అవుతోంది. పత్తి తీసిన కూలీలు ఆగడం లేదు. ఖాళీ చేతులతో తిరిగి వెళ్తే రేపు పండగ పూట వాళ్లతో మాటలు పడాల్సి వస్తుంది. అందుకే వ్యాపారులు చెప్పిన ధరకే విక్రయించుకోవాల్సి వస్తోంది. 3 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి వేశా. ఎకరానికి రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టా. రూ.50 వేలు వస్తే పెట్టుబడి ఖర్చును తీర్చేయొచ్చు. రెక్కల కష్టం పోయినా పర్వాలేదనిపిస్తోంది.
-మందా వీరయ్య, రైతు, కమలాపురం, ముదిగొండ