పాల్వంచ రూరల్, సెప్టెంబర్ 10 : యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. తెల్లవారుజామున లేచి పంట చేల వద్దకు పరుగులు పెట్టాల్సిన రైతులు.. యూరియా బస్తాల కోసం సొసైటీల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తున్నది. పొద్దంతా క్యూలో నిల్చున్నా బస్తా యూరియా దొరకకపోవడంతో దేవుడా అంటూ ఇంటిబాట పడుతున్నారు. బుధవారం పాల్వంచ సొసైటీ కార్యాలయం వద్దకు, జగన్నాథపురం రైతు వేదిక వద్దకు పురుషులతోపాటు మహిళా రైతులు కూడా యూరియా బస్తాల కోసం వచ్చి నానా అవస్థలు పడ్డారు.
కొందరు రైతులు క్యూలో నిల్చోగా.. మహిళా రైతులు ఓపిక లేకపోవడంతో కింద కూర్చున్నారు. పాల్వంచ సొసైటీ కార్యాలయంతోపాటు జగన్నాథపురం రైతు వేదిక వద్ద కూడా బుధవారం ఎరువుల పంపిణీ ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించారు. జగన్నాథపురం, నాగారం, తోగ్గూడెం, రంగాపురం గ్రామాలకు చెందిన రైతులు తెల్లవారుజామునే రైతు వేదిక వద్ద బారులు తీరారు. పాల్వంచ పట్టణంలోని సొసైటీ కార్యాలయం వద్ద అధికారులు మధ్యాహ్నం నుంచి యూరియా పంపిణీ చేయగా.. జగన్నాథపురం రైతు వేదిక వద్ద రైతులకు కూపన్లు పంపిణీ చేశారు.
పాల్వంచ పట్టణంలోని సొసైటీ కార్యాలయం ఎదుట రైతులు బుధవారం సాయంత్రం రాస్తారోకో చేపట్టారు. సొసైటీ కార్యాలయం నుంచి 15 బస్తాల యూరియా సాయంత్రం ఆటోలో ఇతర జిల్లాలకు తరలిస్తున్నారని ఆరోపిస్తూ రైతులు ఆటోను అడ్డుకొని ఆందోళనకు దిగారు. పొద్దంతా ఇక్కడే ఉన్న తమకు ఇవ్వకుండా.. ఇతర ప్రాంతాలకు యూరియా తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను శాంతింపజేశారు. ఆటోలో ఉన్న యూరియా బస్తాలను గోడౌన్‌లోకి తరలించి, ఆటోను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.