కారేపల్లి, ఏప్రిల్ 26 : భూ భారతి చట్టంతో రైతుల భూములకు రక్షణ ఏర్పడుతుందని వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో గల ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై శనివారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.
ఒక్క రూపాయి చెల్లించకుండా రైతులు నేరుగా తాసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ల ద్వారా భూ సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. భూ భారతి చట్టంతో రైతుల భూములకు భద్రత లభిస్తుందని, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం భూ భారతి చట్టం అన్నారు. ఇకపై గ్రామాల్లో భూ పంచాయితీలు, వివాదాలు ఉండవన్నారు. భూములకు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతో భూ భారతి చట్టం, పోర్టల్ తెచ్చినట్లు చెప్పారు. భూ భారతిపై అవగాహన కలిగించేందుకు ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.