రైతు సంక్షేమ పథకాలు అమల్లో రేవంత్ సర్కారు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. దీంతో అర్హులైన అన్నదాతలందరూ ఆయా పథకాలకు దూరమవుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా భద్రాద్రి జిల్లాలో ఏకంగా 1,238 రైతులు రైతుబీమా (ఒక్కో రైతుకు రూ.5 లక్షలు)కు అర్హత కోల్పోవడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. పథకానికి అర్హులైన రైతుల గుర్తింపునకు, వారి నుంచి దరఖాస్తుల స్వీకరణకు, వాటి వివరాల నమోదుకు కేవలం మూడు రోజులు మాత్రమే గడువు ఇవ్వడంతో అనేకమంది రైతులు పథకానికి దూరమయ్యారు.
అధికారిక లెక్కల ప్రకారమే ఇంకా 1,238 మంది అర్హులు రైతుబీమాలో తమ పేర్లు నమోదు చేసుకోకుండా మిగిలి ఉన్నారు. రైతుబీమాలో నమోదు కోసం రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు తగినంత గడువు ఇవ్వకపోవడం, అప్పటికప్పుడు ప్రభుత్వం సర్క్యులర్ విడుదల చేసి మూడు రోజుల్లో వివరాలు సేకరించాలనగడం, సరిగ్గా అదే సమయంలో వరుసగా రెండు రోజులు సెలవు దినాలు ఉండడం, ప్రభుత్వం నుంచి కూడా సరైన ప్రచారం లేకపోవడం వంటివి రైతులకు శాపంగా మారడం గమనార్హం.
-భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ అశ్వారావుపేట, ఆగస్టు 17
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 1.26 లక్షలకు పైగా రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి వ్యవసాయం చేస్తున్నారు. వీరిలో ‘రైతుబీమా’కు అర్హులుగా 1,07,113 మందిని వ్యవసాయ శాఖ గుర్తించింది. దీంతో రైతుబీమా పథకం కోసం 1,05,875 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే, 2024 ఆగస్టు 15 తరువాత నూతనంగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు, పూర్వికుల మరణానంతరం ఇటీవల వారసత్వ పట్టాలు పొందిన రైతులు, ఉమ్మడి సాగుభూమిని విభజించుకున్న రైతులు ఈ ఏడాది ఆగస్టు 14 నాటికి రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నామినీల పేర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు వంటివి నవీకరించుకున్న రైతులు కూడా ఇదే తేదీ నాటికి మరోసారి దరఖాస్తు అందించాల్సి ఉంటుంది. 2024 ఆగస్టు 14కు ముందు రైతుబీమాలో నమోదై ఉండి, చేర్పులు మార్పుల అవసరం లేని రైతులకు రైతుబీమా యథావిధిగా రెన్యూవల్ అవుతుంది. మిగిలిన రైతులందరూ నిర్ణీత తేదీలోగా దరఖాస్తు చేసుకుంటేనే ఆయా రైతులకు రైతుబీమా పథకానికి అర్హత లభిస్తుంది. అయితే, ఇలాంటి వారి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా నిర్ణీత గడువుకు అంటే ఆగస్టు 14వ తేదీకి 15 రోజుల ముందుగానే అవకాశం కల్పించేది.
నమోదు కోసం విస్తృతంగా ప్రచారం కూడా చేసేది. దీంతో రైతులందరూ ఏఈవోల వద్ద దరఖాస్తులు అందించి రైతుబీమాలో నమోదు అయ్యే వారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతు సంక్షేమ పథకాల అమలులో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. దీంతో అర్హులైన రైతుల్లో చాలామంది ఈ పథకానికి దూరమవుతున్నారు. ఈ ఏడాదికి 1,238 మంది అర్హత కోల్పోవడం కూడా ఇదే కోవలోకి వచ్చింది.
ఎంతో ఆదరణ కలిగిన పథకం..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమల్లోకి తెచ్చిన రైతుబీమా పథకానికి రైతుల్లో ఎంతో ఆదరణ ఉంది. ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతులకు సరైన గిట్టుబాటు ధర అందకపోవడం; అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్లో పంటలు దెబ్బతినడం వంటి కారణాలతో చిన్న, సన్నకారు రైతులే అధికంగా నష్టపోతున్నారు. వీటి కారణాల వల్ల ఒక్కోసారి బలవన్మరణాలకూ పాల్పడుతున్నారు. ఒక్కోసారి ప్రకృతి విపత్తులు, ప్రమాదాల కారణంగా కూడా రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు.
అలాంటి సందర్భాల్లో రైతుల కుటుంబాలు మళ్లీ రోడ్డున పడుతున్నాయి. అందుకని రైతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలన్న సంకల్పంతో గత కేసీఆర్ ప్రభుత్వం ప్రపంచంలోనే తొలిసారిగా ‘రైతుబీమా’ పథకాన్ని తీసుకొచ్చింది. రైతు ఏ కారణంతో మరణించినా ప్రభుత్వమే చెల్లించే ప్రీమియంతో రైతు కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందే ఈ పథకానికి విశేష ఆదరణ లభించింది. కానీ రేవంత్ ప్రభుత్వం వచ్చాక అర్హులైన రైతుల నమోదు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా అనేకమంది రైతులు ఈ పథకానికి దూరమవుతున్నారు.
1,238 మంది రైతులు దూరం..
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 1.26 లక్షలకు పైగా రైతులకు వ్యవసాయ భూములున్నాయి. వీరంతా వివిధ పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిలో 1.07,113 మంది రైతులను రైతుబీమాకు అర్హులుగా వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. వీరికి సమాచారం ఇచ్చి పేర్లు నమోదు చేశారు. అర్హులైన రైతుల్లో 1,05,875 మంది రైతులు వివరాలు నమోదు చేసుకోకపోవడంతో వారంతా బీమా ప్రయోజనం పొందుతున్నారు.
అయితే, 2024 ఆగస్టు 14న అర్ధరాత్రి మొదలైన రైతుబీమా పాలసీ గడువు ఈ ఈ నెల 13నే ముగిసింది. అయితే, అప్పటికే రైతుబీమాలో నమోదుకు కొత్త రైతుల నుంచి, చేర్పులు మార్పులు చేయించుకోవాల్సిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాల్సిన ప్రభుత్వం.. ఈ ఏడాది ఆలస్యం చేసింది. గడువు ముగిసేందుకు ఐదు రోజుల ముందుగా అంటే ఈ నెల 8న సర్క్యులర్ జారీ చేసి.. రైతుబీమాకు దరఖాస్తులు ఆహ్వానించాలని అధికారులను ఆదేశించింది.
ఆ సర్క్యులర్ ఈ నెల 9న అధికారులకు అందాయి. అయితే, ఈ నెల 9న రెండో శనివారం, 10న ఆదివారం సెలవు దినాలు కావడంతో రైతులకు సమాచారం అందించేందుకే సమయం సరిపోయింది. ఇక 11, 12, 13 తేదీల్లో కేవలం మూడు రోజులు మాత్రమే గడువు ఉండడంతో వ్యవసాయాధికారులు రైతులు వివరాలు సేకరించి నమోదు చేసుకున్నారు. కాలికి బలపం కట్టుకుని ఏఈవోలు పని చేసినప్పటికీ ఇంకా 1,238 మంది రైతులు ఈ పథక ప్రయోజనాన్ని కోల్పోతున్నారు.
13తోనే బీమా గడువు ముగిసింది..
రైతుబీమా దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 13తోనే ముగిసిపోయింది. 13న రాత్రి వరకూ అప్లికేషన్లను ఆన్లైన్ చేశాం. ఇంకా దరఖాస్తులు అందించని వారు 300 మంది వరకూ ఉండొచ్చు. జూన్ 5లోపు కొత్త పట్టాలు తీసుకున్న వారికి మాత్రమే ప్రభుత్వం అర్హత కల్పించింది. ఆ తర్వాత పట్టాలు వచ్చినా వారు బీమాకు అర్హులు కారు. మళ్లీ వచ్చే ఏడాదే రెన్యూవల్ ఉంటుంది. ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది.
-వేల్పుల బాబూరావు, డీఏవో, భద్రాద్రి
సమాచారం ఇచ్చినా అందుబాటులో లేరు..
రైతుబీమా కోసం అర్హులైన రైతులందరికీ సమాచారం ఇచ్చాం. కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరు రైతులు అందుబాటులో లేరు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులో ఉండడం వల్ల, ఇక్కడ భూములు ఉన్న రైతులు ఇతర ప్రాంతాల్లో స్థిరపడిపోవడం వల్ల అందుబాటులోకి రాలేదు. రైతుబీమా నమోదు గడువు పెంపుపై ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారమూ లేదు.
– పీ.రవికుమార్, ఏడీఏ, అశ్వారావుపేట