తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటిపై దృష్టి సారించడంతో వ్యవసాయానికి పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నది. దీంతో వరిసాగు విస్తీర్ణం బాగా పెరిగింది. కూలీల కొరత ఉన్న నేటి తరుణంలో యాంత్రీకరణపైనే రైతులు ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో కోతల సమయంలో వరికోత మిషన్లు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. ఖమ్మం జిల్లాలోని ఆయా గ్రామాల ప్రజలు నేటికీ కోతల సమయానికి ముందుగానే తమిళనాడు వెళ్లి అక్కడ వరికోత యంత్రాలకు అడ్వాన్స్ చెల్లించి తీసుకొస్తున్నారు. ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దళితులకే కాకుండా రైతులకు సైతం ఆసరాగా నిలువనున్నది. దళితబంధు లబ్ధిదారులు జిల్లావ్యాప్తంగా సుమారు 80 యూనిట్లకు దరఖాస్తు చేసుకోగా ఇప్పటికే 70మందికి వరికోత యంత్రాలను అధికారులు పంపిణీ చేశారు. మొత్తంగా ఈ ఏడాది జిల్లాలో వరి కోతలకు ఇబ్బందులు తొలగనున్నాయి..
ఖమ్మం వ్యవసాయం, అక్టోబర్ 18 : ఉమ్మడి రాష్ట్రంలో సాగైన కొద్ది పంటను సైతం చేజిక్కించుకోవాలంటే అన్నదాతలు పడిన అవస్తలు అన్నీఇన్నీ కావు, ముఖ్యంగా వరిసాగు రైతుల గోస చెప్పతరం కాదు. వానకాలం, యాసంగిలో సైతం వరికోత యంత్రాల కోసం రెండు, మూడు నెలల నుంచే రైతులు తిప్పలపడే వారు. గ్రామంలోకి వరికోత యంత్రాలు వచ్చినప్పటికీ కొందరికే ప్రయోజనం చేకూరేది. మిగిలిన రైతులు మనుషుల సహాయంతోనే కోతలు కోసుకొని కట్టలు కట్టించి, కుప్పలు పెట్టిన తరువాత కానీ వడ్ల పని చేసుకునే వారు. ఈలోపు అకాల వర్షాలు వస్తే పంట మొలకెత్తడం, చేతికి వచ్చిన పంట నీళ్లపాలు కావడం సర్వసాధారణం. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి వనరులు పుష్కలంగా ఉండడంతో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.
గతంలో వానకాలం సీజన్లో జిల్లాలో కేవలం లక్ష నుంచి 1.50 లక్షల ఎకరాల్లో మాత్రమే వరిసాగు జరిగేది. ప్రస్తుతం ఇంచుమించు 3లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేస్తున్నారు. దీంతో హార్వెస్టింగ్ (పంట నూర్పిడి) సవాల్‌గా మారింది. కొద్ది సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం యాంత్రీకరణ పథకం ద్వారా బారాగీ ట్రాక్టర్లు, వరికోత యంత్రాలను రాయితీపై రైతులకు అందజేశారు. దీంతో 50-70 వరికోత యంత్రాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి నుంచి 300కు పైగా వరికోత యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఆయా గ్రామాల ప్రజలు నేటికీ కోతల సమయానికి ముందుగానే తమిళనాడు వెళ్లి అక్కడ వరికోత యంత్రాలకు అడ్వాన్స్ చెల్లించి జిల్లాకు తీసుకొస్తున్నారు. ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దళితులకే కాకుండా రైతులకు సైతం ఆసరాగా నిలువనున్నది. రైతుల పరిస్థితిని గమనించిన దళితబంధు లబ్ధిదారులు జిల్లావ్యాప్తంగా సుమారు 80 యూనిట్లకు దరఖాస్తు చేసుకోగా ఇప్పటికే 70మందికి అధికారులు వరికోత యంత్రాలను పంపిణీ చేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా సుమారు 480 వరికోత యంత్రాలు అందుబాటులో ఉన్నాయి.
సకాలంలో పూర్తికానున్న వరికోతలు
వరికోతల ప్రారంభానికి ముందే రైతులు తమిళనాడు వాహనాలకు అడ్వాన్స్‌లు చెల్లించేవారు. వీలుకాకుంటే పొరుగు గ్రామాలకు వెళ్లి వ్యవసాయ కూలీలకు ఎకరానికి కొంత ఇస్తామని చెప్పి మాట్లాడుకునే వారు. వచ్చే మొదటివారం నుంచి వానకాలం వరికోత పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో ఈ సంవత్సరం ఊరూరా వరికోత యంత్రాలు అందుబాటులోకి రావడంతో కొద్దిరోజుల వ్యవధిలోనే కోతలు పూర్తి అయ్యే అవకాశం ఉంది. పూర్తిస్థాయిలో యంత్రాలు ఉండడంతో ఇక నుంచి వ్యవసాయ కూలీలపై రైతులు ఆధారపడకుండానే కేవలం ఒక్కరోజులోనే పంట నూర్పిడి చేసుకొని ఇంటికి ధాన్యం తీసుకొచ్చుకునే అవకాశం ఉంది. దీంతో యాసంగి సాగు పనులు సైతం త్వరితగతిన ప్రారంభంకానున్నాయి. దశాబ్దాలుగా వానకాలం, యాసంగిలో వరికోతల పనుల ఆలస్యంతో అల్లాడిన సాగు రైతులకు దళితబంధు పథకం ద్వారా పరోక్షంగా ప్రయోజనం చేకూరనున్నది. అంతేకాకుండా యూనిట్ల లబ్ధిదారులకు సైతం చేతినిండా పనిదొరకనున్నది. ఈ పరిస్థితిని ముందే గమనించిన జిల్లా వ్యవసాయశాఖ అధికారులు దాదాపుగా 4-5 నెలలు ఆయా గ్రామాలకు వెళ్లి దళితబంధు లబ్ధిదారులకు అవసరమైన మేర అవగాహన కల్పించడంతో వరికోత యంత్రాలు సాగుకు సరిపడా అందుబాటులోకి వచ్చాయి. జిల్లా రైతుల అవసరాలు పోను మన జిల్లా యంత్రాలు ఇతర జిల్లా రైతులకు సైతం అక్కరకు వచ్చే అవకాశం ఉంది. ఏదిఏమైనా ఊరూరా వరికోత యంత్రాలు రావడంతో వచ్చే యాసంగి పనులు సైతం సకాలంలో ప్రారంభంకానున్నాయి.
సరిపడా వరికోత యంత్రాలు
దళితబంధు పథకం ద్వారా వందలాది వరికోత యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 480 వరకు యంత్రాలు వరి కోతలకు సిద్ధంగా ఉన్నాయి. గతంలో యంత్రాలు సరిపడా లేక చేతికొచ్చిన పంట సైతం వరదలో తడిసిముద్దయైన సంఘటనలు ఉన్నాయి. కూలీల ఖర్చుతో పోల్చుకుంటే యంత్రాల ద్వారా నూర్పిడి రైతులకు ఖర్చు తక్కువ అవుతుంది. సకాలంలో పంటను ఇల్లు, మార్కెట్‌కు తరలించేందుకు అవకాశం ఉంటుంది.
– యం. విజయనిర్మల, డీఏవో, ఖమ్మం