రైతుల అవసరాలను ఆసరాగా చేసుకున్న వ్యాపారులు అదును చూసి యూరియా రేట్లు అమాంతం పెంచేస్తున్నారు. సహకార సొసైటీల వద్ద ఒక రేటు అయితే.. డీలర్ల వద్ద మరో రేటు అమ్ముతున్నారు. తప్పని పరిస్థితుల్లో రైతులు ఎక్కువ రేటుకు యూరియా కొనాల్సి వస్తున్నది. సొసైటీల్లో రూ.265 అమ్ముతుండగా.. బయట రూ.350 నుంచి 400 వరకు విక్రయాలు చేస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుమ్ముగూడెం, ఇల్లెందు, జూలూరుపాడు, సుజాతనగర్, టేకులపల్లి మండలాల్లో ఎక్కువగా యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అన్నదాతలు ఆరోపిస్తున్నారు. అధికారులు మొక్కుబడిగా తనిఖీలు చేయడం వల్ల డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే ‘యూరియా దందా’ కొనసాగిస్తున్నారు. ఇదేకాక రైతులు వద్దన్నా నానో యూరియాను అంటగడుతున్నారు. పైగా యూరియా కావాలంటే తమ షాపులో వేరే మందులు కొనాలని ఇబ్బందులకు గురిచేయడం గమనార్హం.
-భద్రాద్రి కొత్తగూడెం, జూలై 15 (నమస్తే తెలంగాణ)
ఎరువుల కొరత వచ్చిందంటే అక్కడ కాంగ్రెస్ సర్కారు ఉందని అనుకోవాల్సిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో రైతులు ఎరువుల కోసం పడ్డ కష్టాలు మళ్లీ పునరావృతమవుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా కొరత తెచ్చిపెట్టింది. వానకాలంలో పత్తి పంటకు అత్యధికంగా యూరియా అవసరం కావడంతో రైతులు ఎరువుల కోసం సహకార సొసైటీల వద్ద లైన్లు కట్టే పరిస్థితి దాపురించింది.
సీజన్ ఆరంభంలోనే ఎరువుల కొరత ఈ విధంగా ఉంటే.. అసలు సమయానికి ఎంత నరకం చూపిస్తారో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. అప్పుడు ఇల్లెందు, మొన్న గుండాల, నిన్న దుమ్ముగూడెం ఇలా అన్ని మండలాల్లో ఏదో సమయంలో రైతులు యూరియా కోసం లైన్లు కట్టాల్సి వస్తున్నది. యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి. అందుకే యూరియా భవిష్యత్లో దొరకదని ముందస్తుగానే భయపడి మరీ సొసైటీ గోదాముల వద్ద కాపలా కాస్తున్నారు. లైన్లో చెప్పులు వేసి జాగా ఆపుకోవాల్సిన పరిస్థితి ఉందంటే యూరియా కొరత ఎంతమేరకు ఉందో వేరే చెప్పనక్కర్లేదు.
అదునులో యూరియా పిరం చేసి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా రైతులు పత్తి సాగు ఎక్కువగా చేస్తారు. దీంతోపాటు వరిసాగు కూడా అదేస్థాయిలో సాగు చేస్తున్నారు. పత్తి 2,08,711 ఎకరాల్లో సాగు చేయగా.. వరి పంట ఇప్పటివరకు 12,168 ఎకరాల్లో సాగు చేశారు. ఇంకా వరి మరో లక్ష ఎకరాలు సాగుచేసే అవకాశం ఉంది. వర్షాలు లేని సమయంలో పత్తి పంటకు పైపాటు చేసి ఎరువులు వేస్తుంటారు. ఈ సమయంలో అటు సొసైటీ, ఇటు డీలర్లు యూరియా కొరతను సృష్టించడంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు.
పత్తి పంటకు యూరియా అవసరానికి లేకపోతే పంట చేతికందదని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 13 వేల టన్నుల యూరియా అవసరం ఉండగా.. కేవలం 8,300 టన్నులు మాత్రమే అందుబాటులో ఉండటంతో రైతులకు యూరియా దొరకడం కష్టమైంది. దీంతో సొసైటీ గోదాముల వద్ద రైతులు క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పెద్ద రైతులు నేరుగా డీడీలు తీసి కంపెనీల వద్ద నుంచి యూరియా గోదాముల్లో స్టాకు పెట్టుకోవడం ఒకటైతే.. ఆయా గ్రామాల్లో మోతుబరి రైతులు సొసైటీల వద్ద అధికారులన్ని ప్రలోభపెట్టి అధిక మొత్తంలో యూరియా తీసుకెళ్తున్నారు. దీంతో చిన్న రైతులకు యూరియా దొరకడం చాలా కష్టంగా మారింది.
యూరియా కొరత లేదు..
యూరియా దొరకదని తప్పుడు సమాచారం రావడంతో రైతులు భయపడి యూరియా కొనుక్కుంటున్నారు. ఎక్కడా కొరత లేదు. డీలర్లు ఎక్కువ రేటు అమ్మినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటాం. ప్రతిరోజు ఏదో మండలం వెళ్లి తనిఖీలు చేస్తున్నాం. టాస్క్ఫోర్స్ టీం కూడా తనిఖీలు చేస్తున్నారు. సొసైటీల్లో స్టాకు ఉంది. ఇంకా రావాల్సి ఉంది. మనకు అవసరాన్ని బట్టి ఇండెంట్ ఇచ్చాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
-వేల్పుల బాబూరావు, డీఏవో, భద్రాద్రి కొత్తగూడెం
సొసైటీలో రెండు కట్టలే..
సొసైటీల్లో పెద్ద రైతులకే ముందుగా యూరియా ఇస్తున్నారు. క్యూలో గంటలకొద్దీ ఉన్నా రెండు కట్టలే ఇస్తున్నారు. మూడు, నాలుగెకరాలకు రెండు కట్టలు ఎట్లా సరిపోతాయి. బయట కొంటే రేటు ఎక్కువ. అధికారులున్నా పట్టించుకోవడం లేదు. రైతులు వేసిన పంటలకు అధికారులు సరిపడా ఎరువులు ఎందుకు ఇవ్వడం లేదు. ప్రైవేట్ షాపుల్లో యూరియా కొంటే వేరే మందులు కొనమంటున్నారు.
-భూక్యా శంకర్, రైతు, చింతల్తండా, జూలూరుపాడు
కట్ట రూ.400 చొప్పున అమ్ముతున్నారు..
సొసైటీలో ఇచ్చే యూరియా కట్టలు సరిపోవడం లేదు. బయట కొందామంటే నాలుగు వందలకు అమ్ముతున్నారు. బిల్లులో రూ.270 వేసి దానికింద వేరే సొమ్ములు రాసి ఇస్తున్నారు. డీలర్లు ఇష్టం వచ్చినట్లు అమ్ముతున్నారు. అధికారులు రావడం, పోవడం తప్ప చర్యలు తీసుకోవడం లేదు. ఎరువుల దందా ఎంతకాలం చేస్తారు. చివరికి ప్రభుత్వం కూడా స్పందించిన పాపానపోలేదు.
-రాములు, రైతు, చింతల్తండా, జూలూరుపాడు