దుమ్ముగూడెం, ఆగస్టు 21 : రుణమాఫీ రైతులందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో దుమ్ముగూడెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయంలో అందజేశారు.
సంఘం మండల అధ్యక్షుడు బొల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మండల కార్యదర్శి కొడాలి లోకేశ్‌బాబు మాట్లాడారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు చెప్పిన విధంగా అందరికీ షరతులు లేకుండా రుణమాఫీ వర్తింపజేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు లేకపోవడం, అసైన్డ్ భూముల్లో పొజిషన్లో ఉన్నందున అడంగల్, పహాణీపై రుణాలు తీసుకునే వారికి కూడా రుణమాఫీ వర్తింపచేసి కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
లేదంటే రైతులతో కలిసి రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలమంచి వంశీకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మర్మం చంద్రయ్య, ఎలమంచి శ్రీనుబాబు, బొల్లి సాయిబాబు, సమ్మక్క, కాకా కామయ్య, కృష్ణ, యాసా శ్రీనివాసరెడ్డి, తెల్లం ధర్మయ్య, రమణయ్య, వాసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.