కారేపల్లి, ఆగస్టు 20 : అర్హత కలిగిన రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన అనంతరం సీపీఎం జిల్లా నాయకుడు భూక్యా వీరభద్రంనాయక్ మాట్లాడారు.
రైతులందరి రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 30 శాతం మందికే మాఫీ చేసి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. రూ.2 లక్షలు తీసుకున్న ప్రతి రైతు రుణం మాఫీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. అలాగే రైతుబంధు నగదును రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. రైతులకు న్యాయం జరిగేంతవరకు వారి వెంట ఉండి పోరాటాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కొండబోయిన నాగేశ్వరరావు, కుందనపల్లి నరేందర్, తలారి దేవప్రకాష్, వజ్జా రామారావు, ఏకాంబరం, దాసరి మల్లయ్య, రామారావు, రామచంద్రయ్య, రైతులు పాల్గొన్నారు.