ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 5 : పత్తికి కనీస మద్దతు ధర క్వింటాకు రూ.5,721 ఉండగా.. రూ.5 వేలకు మించి ధర పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీపీఐ, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డు ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. తొలుత పత్తి మార్కెట్లోకి వాహనాలు వెళ్లకుండా ఆందోళన చేపట్టారు. అనంతరం యార్డులో కాంటాలను అడ్డుకోవడంతోపాటు పత్తి యార్డు కార్యాలయానికి తాళం వేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు మాట్లాడుతూ పత్తి మార్కెట్లో దళారుల దందాతో రైతులు నష్టాలను చవిచూస్తున్నారని, వారి చేతిలో మార్కెట్ బందీ అయ్యిందని, సీసీఐ కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు.
మార్కెట్లో నేటి వరకు ప్రైవేట్ వ్యాపారులు 5,200 మెట్రిక్ టన్నుల పత్తి కొనుగోలు చేయగా, సీసీఐ అధికారులు కేవలం 178 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారన్నారు. పత్తి ఎక్కువగా పండించే ప్రాంతాల్లో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని అయన ప్రశ్నించారు. మార్కెట్లో సీసీఐ కేంద్రం ఏర్పాటు చేయని పక్షంలో కొనుగోళ్లను అడ్డుకుంటామని హెచ్చరించారు. అనంతరం గిట్టుబాటు ధర కల్పిస్తామని అదనపు కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మార్కెట్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్‌కు రైతుల సమస్యల గురించి వివరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, నాయకులు మహ్మద్ మౌలాన, జితేందర్‌రెడ్డి, ఎర్రా బాబు, దొండపాటి రమేశ్, గోవిందరావు, సీతామహాలక్ష్మి, కళావతి, రామ్మూర్తి, శ్రీనివాసరావు, వీరభద్రం, పుచ్చకాయల సుధాకర్, రవి, సాంబశివరెడ్డి, శశిధర్ పాల్గొన్నారు.
రేవంత్ పాలనలో అన్నీ మోసాలే.. ఎన్డీ నాయకుడు ఆవునూరి మధు
కారేపల్లి, నవంబర్ 5 : ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో రైతులు అన్ని విధాల మోసపోతున్నారని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు అవునూరి మధు ఆరోపించారు. మండల కేంద్రంలోని జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద మంగళవారం ఆ పార్టీ మండల కార్యదర్శి వై.ప్రకాశ్ ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నా.. వాటి వల్ల రైతులకు ఎటువంటి లాభం కలగడం లేదన్నారు. రైతులు విక్రయానికి తీసుకొచ్చే పత్తిని ఎలాంటి కొర్రీలు లేకుండా కొనుగోలు చేయాలని, వారికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్డీ నాయకులు పేర్ని వెంకటేశ్వర్లు, చింత రజిని, నర్సింహారావు, మస్తాన్, రవికుమార్, వేణు తదితరులు పాల్గొన్నారు.