ఖమ్మం, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మంజిల్లా అంటేనే మూడు సీజన్లకు పంటలను సాగుచేసే సత్తా ఉంటుంది. సంప్రదాయ పంటల సాగుతోపాటు అనేక రకాలైన అధునిక పంటల సాగుకు చిరునామాగా పేరుంది. సాగర్ ఆయకట్టు ద్వారా ఈ సంవత్సరం పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ పంటలకు అవసరమైన యూరియా లభ్యత లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. జిల్లా చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా మార్క్ఫెడ్ గోడౌన్లలో బఫర్స్టాక్లు గణనీయంగా పడిపోవడంతో ప్రస్తుతం సాగులో ఉన్న పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
సాధారణంగా వేసవి సీజన్లోనే జిల్లా కేంద్రం ఖమ్మంలోని గోడౌన్లు బఫర్స్టాక్తో నిండిపోతుంటాయి. జూన్ నెల నాటికి ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉంటాయి. ఆగస్టు నెల వచ్చిందంటే చాలు 30-35 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాలో బఫర్స్టాక్ రూపంలో ఉంటుంది. అలాంటి ప్రస్తుతం రికార్డుస్థాయిలో పడిపోయి కేవలం 100 మెట్రిక్ టన్నులకు చేరింది. ఒకటి రెండురోజుల్లో జిల్లావ్యాప్తంగా అన్ని వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో సైతం పూర్తిగా నిల్వలు పడిపోయే పరిస్థితికి చేరింది. శనివారం నాటికి జిల్లావ్యాప్తంగా ఐదు మండలాల పరిధిలోని సొసైటీలో ఎరువుల నిల్వలు లేకుండాపోయాయి.
దీంతో రైతుల నుంచి తీవ్ర ఆగ్రావేశాలు రేకెత్తాయి. ఒక్కటి కాదు.. రెండు కాదు పదేండ్ల కేసీఆర్ పాలనలో ఏనాడు యూరియా కోసం ఇంత అవస్థ పడలేదని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎరువుల కోసం పడిన బాధలను తిరిగి కాంగ్రెస్ సర్కార్ మరోమారు రైతులకు తెచ్చిపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకటి రెండ్రోజుల్లో ఉత్తరప్రదేశ్ నుంచి రైల్వే వ్యాగన్ ద్వారా యూరియా నిల్వలు రావచ్చని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. సొసైటీల్లో యూరియా నిల్వలు అడుగంటుతున్నా ప్రైవేట్ డీలర్ల వద్ద రెండింతలు ఎలా ఉంటున్నాయని సొసైటీల వద్దకు వచ్చిన రైతులు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా ఒకటీ రెండ్రోజుల్లో వ్యాగన్ జిల్లాకు రాకపోతే వ్యవసాయం రంగంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంటుందని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు.
జిల్లా వ్యవసాయశాఖ అధికారుల గణాంకాల ప్రకారం ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో 238 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉండగా, ప్రైవేట్డీలర్ల వద్ద కేవలం 392 మెట్రిక్ టన్నులు నిల్వ ఉంది. ఖమ్మంరూరల్, ఖమ్మంఅర్బన్, కొణిజర్ల సింగరేణి మండలాల పరిధిలోని సొసైటీల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మండలాల వారీగా పరిశీలిస్తే బోనకల్లు మండలంలో 12 మెట్రిక్ టన్నులు, చింతకానిలో 41 టన్నులు, ఏన్కూరులో 72 క్వింటాళ్లు, కల్లూరులో 45 క్వింటాళ్లు, కామేపల్లిలో 11 టన్నులు,
కూసుమంచిలో 2 టన్నులు, మధిరలో 57 టన్నులు, ముదిగొండలో 25 టన్నులు, నేలకొండపల్లిలో 3 టన్నులు, పెనుబల్లిలో 6 టన్నులు, రఘునాథపాలెంలో 4 టన్నులు, సత్తుపల్లిలో 27 క్వింటాళ్లు, తల్లాడలో 4 టన్నులు, తిరుమలాయపాలెంలో 145 క్వింటాళ్లు, వేంసూరులో 2 టన్నులు, వైరాలో 22 టన్నులు, ఎర్రుపాలెం మండలంలో 43 టన్నుల చొప్పున యూరియా నిల్వలు ఉన్నాయి. ఆదివారం నాటికి ఇంచుమించు అన్ని మండలాల్లో యూరియా నిల్వలు అడుగంటే ప్రమాదం ఉంది. ప్రైవేట్ డీలర్లకు సంబంధించి ఆయా మండలాల్లో 392 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది.
ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో విచిత్ర పరిస్థితి కనిపిస్తున్నది. జిల్లా వ్యవసాయ, మార్క్ఫెడ్ అధికారుల గణాంకాల ప్రకారం ప్రతి ఏటా ఆగస్టు నెలలో 30వేల నుంచి 35వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉండాలి. కానీ ప్రస్తుతం రికార్డుస్థాయిలో యూరియా నిల్వలు పడిపోయి శనివారం నాటికీ కేవలం 100 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంది. సీఆర్పీ కోటాకు సంబంధించి మరో 150 మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ నుంచి ప్రత్యేక 2600 మెట్రిక్ టన్నుల నిల్వలతో గూడ్స్ వస్తుందని అధికారులు తెలుపుతున్నారు. అది సైతం ఉమ్మడి వరంగల్ జిల్లాకు 13 వందల మెట్రిక్ టన్నులు కాగా, ఉమ్మడి ఖమ్మంజిల్లాకు మరో 13వందల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉంది. అయితే వ్యాగన్ రాకకు సంబంధించి కచ్చితమైన సమాచారం లేదు.