తిరుమలాయపాలెం/టేకులపల్లి/కూసుమంచి, మే 14 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం అతలాకుతలం చేసింది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపోవడంతోపాటు ఇళ్ల పైకప్పు రేకులు లేచిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడి తీగలు తెగిపోయాయి. తిరుమలాయపాలెం మండలం గోల్‌తండా, జింకలగూడెం, గోపాయిగూడెం, పాతర్లపాడులో ఈదురుగాలి బీభత్సం సృష్టించింది. గోపాయిగూడెం స్టేజీ సమీపంలో ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై గాలిదుమారంతో ఒక్కసారిగా వర్షం కురవడంతో భారీ వృక్షాలు రోడ్డుపై కూలిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గంటలతరబడి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చెట్లు కూలిన ప్రదేశానికి జేసీబీ వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వాహనదారులు, పోలీసులు గొడ్డళ్లతో చెట్ల కొమ్మలను తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
ఆయా గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, పెద్ద పెద్ద వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ తీగలు తెగిపోయాయి. ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. గోల్‌తండా వద్ద రోడ్డుపై చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో పాతర్లపాడు స్టేజీ నుంచి గోల్‌తండా మీదుగా జల్లేపల్లి, హైదర్‌సాయిపేట వరకు వాహనదారులు అవస్థలు పడ్డారు. రోడ్లపై పడిన చెట్లను ప్రజలు తొలగిస్తున్నారు. గాలిదుమారం బీభత్సానికి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. టేకులపల్లి మండలం బోడు, మొక్కంపాడుతండా, రామచంద్రునిపేట, కొప్పురాయి, బర్లగూడెం గ్రామ పంచాయతీల పరిధిలో సాయంత్రం తీవ్రమైన గాలులు, ఉరుములతో వర్షం కురిసింది. మొక్కంపాడుతండాలో బానోత్ రవి ఇంటి ఆవరణలో ఉన్న వేప చెట్లు విరిగి ప్రహరీపై పడింది. అదే తండాకు చెందిన బానోత్ నరేశ్‌కు చెందిన ఇంటిపై కప్పు రేకులు ఎగిరిపోయాయి. పలుచోట్ల చెట్లు రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. పలు గ్రామాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. కూసుమంచి మండలంలోని పలు ప్రాంతాల్లో 30 నిమిషాలపాటు వర్షం కురిసింది.