చండ్రుగొండ, జూన్ 18: అనుమతి లేకుండా గ్రామాల్లో విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. చండ్రుగొండ పోలీస్ స్టేషన్లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుజాతనగర్‌కు చెందిన భూక్యా శివనాగ్, సాయిదుర్గాప్రసాద్, యోగినాథ్, బెండాలపాడు గ్రామస్తులు కానం అన్వేషన్, వీరభద్రం కలిసి ఈ నెల 17(మంగళవారం)న చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో అనుమతి లేకుండా పత్తి, మిరప విత్తనాలను విక్రయిస్తున్నారు.
వారిని వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో పోలీసులు పట్టుకున్నారు. 105 పత్తి విత్తనాల ప్యాకెట్లు, 1025 మిరప విత్తనాల ప్యాకెట్లు స్వాధీనపర్చుకున్నారు. వీటి విలువ రూ.12.75 లక్షల వరకు ఉంటుంది. సుజాతనగర్లో విక్రయించాల్సిన విత్తనాలను చండ్రుగొండ మండలంలో విక్రయించడంపై ఏవో వినయ్ ఫిర్యాదుతో కేసు నమోదైంది. దర్యాప్తు సాగుతున్నది.
ఈ విత్తనాలను పరీక్షలకు పంపిస్తామని, నకిలీవని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ చెప్పారు. గ్రామాల్లో ఎవరైనా నకిలీ, అనుమతి లేని విత్తనాలు విక్రయిస్తే పోలీసులకు తెలపాలని రైతులను కోరారు. విత్తనాల విక్రయ దుకాణాలను వ్యవసాయాధికారులతో కలిసి తనిఖీ చేస్తామన్నారు. అనుమతి ఉన్న విత్తన కంపెనీల విత్తనాలనే రైతులు కొనాలన్నారు. ఎస్సై శివరామకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.