భద్రాచలం, జూలై 13 : గిరిజనుల విద్యాభివృద్ధి, ఆర్థికాభివృద్ధికి, రైతుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఐటీడీఏలను నెలకొల్పిందని, ఇవి గిరిజనులకు దేవాలయాల వంటివని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్ అన్నారు. శనివారం ఐటీడీఏ సమావేశ మందిరంలో గిరిజనుల భూ, వ్యక్తిగత, గ్రామాల్లోని సమస్యలు, పరిష్కరించడానికి గిరిజన సంఘాల నాయకులు, అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తొలుత ఐటీడీఏ కార్యాలయానికి విచ్చేసిన ఆయనకు అధికారులు, ఆదివాసీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనులకు రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయిలో పరిష్కారం కానీ సమస్యలు పరిష్కరించడానికి ప్రధానమంత్రి మోదీ ఎస్సీ, ఎస్టీ కమిటీలతో తనను నియమించారని తెలిపారు.
ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం, రహదారుల సౌకర్యం కల్పించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. గిరిజనుల భూ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు ఏమైనా పెండింగ్‌లో ఉంటే వాటికి ప్రతిపాదనలు తయారు చేసి పది రోజుల్లోగా నివేదిక అందజేయాలని ఐటీడీఏ అధికారులను ఆదేశించారు. గిరిజనులకు పోడు పట్టాలు, గిరిజన పాఠశాలల్లో సమస్యల గురించి ఆదివాసీ, గిరిజన నాయకులు ఆర్జీలు సమర్పించగా.. గిరిజనులకు పోడు పట్టాల విషయమై చర్యలు తీసుకోవాలని, కొన్నిచోట్ల గిరిజనులు పోడు సాగు చేసుకుంటున్నా వారికి పట్టాలు లేవని, వారికి పట్టాలు ఇవ్వాలన్నారు. అనంతరం ఎంఎస్ఎంఈ యూనిట్ మహిళలు తయారు చేసిన షాంపూలు, సబ్బులు పరిశీలించి, వారికి జీవనోపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ట్రైకార్ జీఎం కుంజా శంకర్, ఏపీవో జనరల్ డేవిడ్‌రాజ్, ఆర్డీవో దామోదర్‌రావు, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ మణెమ్మ, ఈఈ తానాజీ, ఐటీడీఏ అధికారులు, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
గిరిజనులకే ప్రాధాన్యం ఇవ్వాలి
గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి రంగాల్లో గిరిజన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వాలని, దీంతో వారి కుటుంబాలను పోషించుకునేందుకు వీలు కలుగుతుందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్ అన్నారు. శనివారం బీపీఎల్ అతిథి గృహంలో ఐటీసీలో పనిచేసే కార్మికుల సమస్యల గురించి యూనియన్ ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐటీసీలో పనిచేసే సిబ్బంది తెలంగాణ వారై ఉండి.. అందులో ఎక్కువ శాతం గిరిజనులకే అవకాశం కల్పించాలన్నారు. అనంతరం యూనియన్ నాయకులు ఆయనను శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో ట్రైకార్ జీఎం శంకర్రావు, ఆర్డీవో దామోదర్‌రావు, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి మణెమ్మ, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ, వివిధ యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.