కొత్తగూడెం అర్బన్ : బతుకమ్మ ( Bathukamma ) పండుగ సందర్భంగా చెరువులు, నదులు, కాల్వలకు సంబంధించిన బతుకమ్మ ఘాట్లలో మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యాలు కల్పించాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు ( MLA Kunamneni Sambhashiva Rao) అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్, గ్రామపంచాయతీ, పోలీసు, నీటిపారుదల, విద్యుత్ తదితర శాఖల అధికారులతో శనివారం ఆయన ఫోన్లో సూచనలు, సలహాలు అందించారు.
ఘాట్లలో ప్రమాదాలు చోటుచేసుకోకుండా అత్యవసర నిర్మాణాలు చేపట్టాలని, విద్యుత్ సౌకర్యం కల్పించాలని, పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చాలని ఆదేశించారు. పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, బతుకమ్మ పండుగను మహిళలు సంతోషంగా జరుపుకునేలా సమన్వయంతో పనిచేసి తగిన ఏర్పాటు చేయాలని సూచించారు.
బతుకమ్మ ఆటలు ఆడే గ్రామ, బస్తీ సెంటర్లలో, దుర్గామాత మండపాలు, పరిసర ప్రాంతాల్లో విద్యుత్, పారిశుద్ధ్యం పనులు ముమ్మరంగా చేపట్టాలన్నారు. జిల్లాకేంద్రంలోని ముర్రేడు వాగు ప్రధాన బతుకమ్మ ఘాట్ అభివృద్ధికి రూ.50లక్షలు మంజూరు చేయించి శంకుస్థాపన చేశామని వివరించారు. త్వరలో పనులు పూర్తవుతాయని కూనంనేని తెలిపారు.