ఖమ్మం రూరల్, జూన్ 03 : నాణ్యమైన విత్తనాలతోనే ఆశించిన దిగుబడులు సాధించవచ్చని మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బైరి హరినాథ్ బాబు, కూసుమంచి డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు బి.సరిత అన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విశ్వవిద్యాలయం సరఫరా చేసిన క్వాలిటీ విత్తన సంచులను ఏడిఏతో కలిసి చైర్మన్ రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకుని సాగు చేసుకోవడం ద్వారా పది నుంచి పదిహేను శాతం అధికంగా దిగుబడులు పొందవచ్చు అని తెలిపారు.
విత్తనాలను సాగు చేసుకునే సమయంలో విత్తన శుద్ధి తప్పనిసరిగా చేపట్టాలన్నారు. ఇతర వాణిజ్య పంటలకు సంబంధించిన విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికృత డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన సమయంలో డీలర్ల వద్ద తీసుకున్న బిల్లులను పంట చేతికి వచ్చేవరకు భద్రపరుచుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి డివిజన్ ఆత్మ కమిటీ డైరెక్టర్లు మురళి రంగారావు, మహేశ్, మండల వ్యవసాయ శాఖ అధికారి ఉమా నగేశ్, ఏఈఓలు వంశీ, ఆదర్శ్, కావ్య, హిమబిందు, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.