భద్రాచలం, ఏప్రిల్ 1 : భద్రాచలంలో శ్రీరామనవమి విధులు నిర్వర్తించే అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించొద్దని, తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ అధికారులకు సూచించారు. భద్రాచలంలో ఈ నెల 6న జరిగే శ్రీరామనవమి, మహా పట్టాభిషేకం ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. మిథిలా స్టేడియంలో శ్రీరామనవమి ఏర్పాట్లతోపాటు పరిసర ప్రాంతాల్లో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చేపడుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. చలువ పందిళ్లు, వీఐపీ, వీవీఐపీ సెక్టార్లను పరిశీలించి భక్తులకు అందాల్సిన ప్రసాదాలు, తలంబ్రాలు తదితరాలపై అధికారులతో మాట్లాడారు.
శ్రీరామనవమి, పట్టాభిషేకం వేడుకలకు హాజరయ్యే భక్తులు, పర్యాటకుల కోసం తొలిసారిగా ఫాగ్ మీస్ట్ (మంచు తుంపర్లు) ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. మంగళవారం ఆయన ఈవో రమాదేవి, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్‌తో కలిసి కల్యాణ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో రాహుల్, ఆర్డీవో దామోదరరావు, తహసీల్దార్ శ్రీనివాస్, పంచాయతీ ఈవో శ్రీనివాస్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.