మధిర, మార్చి 27 : ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్లా ఖాన్ పిలుపు మేరకు ఖమ్మం హెడ్ క్వార్టర్ హాస్పటల్ మన ఇంటిలో అదనపు వస్తువులు మరొకరికి ఉపయోగం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బానోత్ కళావతి భాయ్ ఆదేశాల మేరకు మధిరలో ప్రముఖ సంఘ సేవకుడు, ఆరోగ్య పర్యవేక్షకులు లంకా కొండయ్య బృందం హెల్పింగ్ హోమ్ పేరుతో పాత సామానుల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.
దాతల నుండి సేకరించిన పలు రకాల సామాన్లను కొండయ్య గృహ ప్రాంగణంలో సీనియర్ వైద్యుడు డాక్టర్ రామనాదం, ప్రముఖ రంగస్థల సమాఖ్య అధ్యక్షుడు పుతుంభక కృష్ణ ప్రసాద్ రావు చేతులు మీదుగా పేదలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేసి మానవత్వం చాటుకోవాలన్నారు. ఉపయోగించని పలు రకాల వస్తువులు పేదల కోసం అందజేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వీఆర్&ఎస్ ఫౌండేషన్ నిర్వాహకుడు పారుపల్లి వెంకటేశ్వరావు, రామభక్త సీతయ్య కళా పరిషత్ నిర్వాహకుడు మధిర బాబ్లా, లంకా సేవా ఫౌండేషన్ వాలంటీర్లు పాల్గొన్నారు.